గత ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవంకు రాష్ట్ర ప్రథమ పౌరులైన తనను ఆహ్వానించలేదని అంటూ గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానిస్తున్నారా? అంటూ ఎదురు దాడికి దిగారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో తమిళసై మాట్లాడుతూ భారత్ కు వచ్చే దేశాధినేతలను కూడా కలుసుకునే అవకాశం ఉంటుందని, తెలంగాణలో సీఎంను కలిసే అవకాశం మాత్రం ఉండదని, ఇది దురదృష్టకరమని అంటూ నిష్ఠూరంగా మాట్లాడారు.
అందుకు ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఘాటుగా సమాధానం ఇస్తూ కొన్ని దేశాలు దగ్గర కావొచ్చు కానీ తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ దగ్గర కావని తేల్చి చెప్పారు. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించినప్పుడు రాష్ట్రపతిని పిలిచారా? వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించామా? అని నిలదీశారు.
గవర్నర్ బిల్లులు ఆపడం తప్ప సాధించిందేంటూ హరీష్ మండిపడ్డారు. సుప్రీం కోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులో కదలిక రాలేదని అంటూ గవర్నర్ ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏడు ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లులను గవర్నర్ ఆపడం రాజకీయం కాకపోతే ఏంటని ప్రశ్నించారు.
గవర్నర్ తమిళి సై గతంలో పోటీచేస్తే ఎక్కడైనా గెలిచారా? అంటూ కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలిచారని చెప్పారు. కావాలనుకుంటే గవర్నర్ మళ్లీ బీజేపీలో చేరొచ్చని, పోరాటం చేయొచ్చని హరీశ్ హితవు చెప్పారు.
గవర్నర్ గా, మహిళగా తమిళసైని గౌరవిస్తామని, కానీ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం బాధిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, గవర్నర్ అయినా ఓపెన్ మైండ్ తో ఉండాలని హితవు చెప్పారు.
మరోవంక, రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. గవర్నర్ రాజకీయాలు చేయకపోతే ఆమెను గౌరవించేవారిమని చెబుతూ సీఎం కేసీఆర్ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి రాజకీయం చేసేవారిని కలవరని స్పష్టం చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచి నష్టపరిహారం ఇప్పించేందుకు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని ఆయన గవర్నర్ కు సూచించారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో గవర్నర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు చేయాల్సింది రాజకీయాలు కాదని హితవు పలికారు.
తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రధానికి గవర్నర్ గా లేఖ రాయాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు సడలించేలా ప్రయత్నాలు చేయాలని ఆయన గవర్నర్ కు సూచించారు.