అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతి ఇచ్చే విషయంలో గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వంల మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లి, సామరస్యంగా ముగియడంతో పాటు బడ్జెట్ సమావేశాలు సహితం సవ్యంగా జరగడంతో గవర్నర్ – సీఎం కేసీఆర్ ల మధ్య దూరం తగ్గినదని అందరూ భావిస్తున్నారు.
అయితే దీర్ఘకాలంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పరిశీలించకుండా తన వద్దనే పెట్టుకొంటున్నారనే ఆగ్రహంతో కేసీఆర్ ప్రభుత్వం నేరుగా గవర్నర్ తీరుపై సుప్రీం కోర్టును గురువారం ఆశ్రయించింది. గవర్నర్ 10 బిల్లులకు ఆమోదం తెలపడం లేదని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిట్ పిటీషన్ వేశారు. ఈ రిట్ పిటిషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు.
ఈ పిటీషన్ పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా చాలా రోజులుగా 10 బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా తొక్కిపడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. 6 నెలలుగా కొన్నిబిల్లులు రాజ్ భవన్ లోనే ఉంటున్నాయని ప్రభుత్వ వర్గాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు 194 పేజీలతో కూడిన రిట్ పిటీషన్ లో ఈ విషయాలు వెల్లడించారు.
దాదాపు సెప్టెంబర్ 14 2022 నుంచి గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లులు అన్నీ కూడా స్పష్టమైన ఆధిక్యంతో రాష్ట్ర శాసనసభ ఆమోదించినవే. అయితే గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో వీటిని గెజిట్ ద్వారా ప్రకటించలేక పోతున్నామని ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్, ఖైతన్నపల్లి మున్సిపాలిటీ పేరు మార్పు బిల్లు, వైద్య విద్యా డైరెక్టర్ వంటి 10 బిల్లులను గవర్నర్ ఆమోదించేలా చూడాలని సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది.
కాగా అసెంబ్లీలో ఓ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అది శాసనమండలికి వెళ్తుంది. ఆ తరువాత అక్కడ ఆమోదం అనంతరం గవర్నర్ వద్దకు వెళ్తాయి. వాటిని గవర్నర్ పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లులు సక్రమంగా లేకపోతే వాటిని గవర్నర్ తిరస్కరించవచ్చు. లేదా వివరణలు కోరవచ్చు.
గవర్నర్ తిరస్కరించిన పక్షంలో మంత్రివర్గం పరిశీలించి తిరిగి పంపితే వాటికి ఆమోదం తప్పక తెలుపవలసి ఉంటుంది. అందుకనే ఆ బిల్లులను పెండింగ్ లో ఉంచుతున్నారు.