బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం రాకపోయే సరికి అయోమయంలో పడి కోర్టుకెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పాలయ్యారు. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తామని, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు తెలియచేయడం ద్వారా గవర్నర్ తో సయోధ్యకు వచ్చారు.
ఇక సాయంత్రానికల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు,అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైని కలిసారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ ఆమెను లాంఛనంగా ఆహ్వానించారు. ఇక సత్వరమే తెలంగాణ బడ్జెట్‌కు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. మొత్తమ్మీద, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న రాజకీయ సంక్షోభం హైకోర్టు వేదికగా పరిష్కారమైంది.
ఈ కేసును నిన్న విచారించిన హైకోర్టు చివరకు ఇరువురి మధ్య సయోధ్యను కుదిర్చింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మాట్లాడుకొని రావాలన్న హైకోర్టు సూచనతో గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి.
దానితో వరుసగా గవర్నర్ విషయంలో కేసీఆర్ కు ఎదురుదెబ్బలు తగిలినట్లయింది. గతేడాది మాదిరిగానే ప్రభుత్వం ఈసారి కూడా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేసే ప్రయత్నం బెడిసికొట్టింది.
మొన్న గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని, పెరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దాంతో సర్కారు కొంత వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు తాజాగా గవర్నర్‌తో రాజీ పడేట్లు చేసి, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేట్లు చేసింది. గవర్నర్ తీరును ఎత్తి చూపాలని తలచిన ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామమే. చేసేది లేక గవర్నర్ ప్రసంగాన్ని ఉండేలా చూస్తామంటూ హైకోర్టుకు చెప్పాల్సి వచ్చింది.
ఇదివరకు ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభించాల్సి ఉంది. అదేరోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీల్లో మార్పు చోటు చేసుకోనుంది. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10కి గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 6న ఉదయం 10.30 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటిలాగే గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను మరోసారి అవమానించాలని భావించి, కోర్టుకెళ్లి భంగపడిందని, చివరికి బడ్జెట్ సమావేశాల తేదీ కూడా మార్చుకునే ఆలోచన చెయ్యాల్సి వచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు.
80 వేల పుస్తకాలు చదివిన అని గప్పాలు కొట్టుకునే సీఎం కేసీఆర్..ముందు రాజ్యాంగాన్ని చదవాలని వైస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించాలని ప్రయత్నించిన సీఎం కేసీఆర్ భంగపాటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తూ కోర్టుల్లో కేసీఆర్ అడ్డంగా దొరికిపోతున్నారని విమర్శించారు.