గవర్నర్ తమిళిసై ట్వీట్ పై ఎగిరిపడ్డ హరీష్ రావు!

Wednesday, January 22, 2025

కొద్దికాలంగా గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ ను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఆమె తన ప్రపంచంలోనే కాలం గడుపుతున్నారు. సమయం, సందర్భం లేకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరచడం చేస్తూ ఓ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు.

ఆమెను కూడా రాష్త్ర మంత్రులు, బిఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం మానేశారు. అయితే, తాజాగా ఉస్మానియా హాస్పిటల్ గురించి ఆమె ట్వీట్ ఇవ్వడంతో వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఆర్ధికమంత్రి టి హరీష్ రావు ఇంతెత్తున ఎగిరిపడ్డారు. ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

గవర్నర్ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలలో ఒక్క దానినైనా గుర్తించారా? అని గవర్నర్ ను నేరుగా ప్రశ్నించారు. వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి గవర్నర్ కు కనిపించలేదా? అంటూ నిలదీశారు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం కట్టాలని 2015లోనే సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారని, ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కొత్త భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  కరోనా టైంలో ఉస్మానియా వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందించారని గుర్తుచేశారు.

తెలంగాణ వైద్యశాఖ సేవలు మెచ్చి కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చిందని పేర్కొంటూ అయితే బీఆర్ఎస్ పాలనలో చెడు మాత్రమే గవర్నర్ చూస్తారని, దానిపై మాట్లాడతారాని మంత్రి ఆరోపించారు. గవర్నర్‌ తమిళిసై రాజకీయ ఉద్దేశాలతో వ్యాఖ్యలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కంటి వెలుగులాంటి కార్యక్రమాన్ని గవర్నర్ ఎందుకు మెచ్చుకోలేదని ప్రశ్నించారు. నిమ్స్‌ ఆసుపత్రిలో పడకల పెంపు, అత్యాధునిక సేవలపై కనీసం ఒక్క ట్వీట్‌ కూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ తమిళి సై బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడడం సరికాదని హితవు చెప్పారు.

అంతకు మందు గవర్నర్ తమిళిసై గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ పేరుతో ఓ ట్విటర్‌ ఖాతా పోస్టు రీట్వీట్ చేశారు.

ఆస్పత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటోలు, కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లెటర్ ను ఆమె ట్వీట్‌ చేశారు.  ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందని ఆమె గుర్తు చేశారు. ఆసుపత్రి నూతన భవనాన్ని తొందరగా నిర్మించాలని ప్రభుత్వానికి గవర్నర్  సూచించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles