గవర్నర్ తమిళిసై కు స్థానసంచలనం తప్పదా!

Wednesday, January 22, 2025

ఒక వంక ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, హైదరాబాద్ లో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ అకస్మాత్తుగా ఢిల్లీకి ప్రయాణం కావడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. పలు ఊహాగానాలకు తావిస్తున్నది.

బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం వెళ్లినట్లు చెబుతున్నా రాజకీయ అజెండాతోనే వెళ్లినట్లు తెలుస్తున్నది. ఢిల్లీ వెళ్ళగానే తమిళనాడు మూలాలున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆమె భేటీ కావడం ఆసక్తి కలిగిస్తున్నది. మరోవంక, హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వంతో ఆమె సయోధ్య కుదుర్చుకోవడం, రెండేళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని ఒక్క అక్షరం కూడా మార్చకుండా చదవడం, మొదటిసారిగా కేంద్రాన్ని, ముఖ్యంగా ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తకుండా ప్రసంగించడం కేంద్ర బీజేపీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తున్నట్లు చెబుతున్నారు.

ఒక వంక, బిఆర్ఎస్ పేరుతో దేశ వ్యాప్త పర్యటనలు చేస్తూ, కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ కన్నా ఎక్కువగా విరుచుకు పడుతూ ఉంటె, ఇక్కడ గవర్నర్ ఆయనతో సయోధ్యతో వ్యవహరించడం వారికి విస్మయం కలిగిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు సహితం ఆమె ప్రసంగం తీరుపట్ల ఖంగుతిన్నారని చెబుతున్నారు.

గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎక్కడకు వెళ్లినా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వాగతం పలకడం లేదని ఆమె తరచూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. చివరకు రిపబ్లిక్ డే ప్రసంగంలో నేరుగా ఫార్మ్ హౌస్ , భారీ నిర్మాణాలు అభివృద్ధి కాదంటూ దండెత్తారు. ఆ సమయంలో రాష్ట్ర బిజెపి నాయకులు ఆమెకు బాసటగా నిలిచారు.

బడ్జెట్ సమావేశాల ప్రతిపాదనలపై ఆమె సంతకం చేయకుండా కూర్చోవడంతో రాష్ట్ర హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ విషయమై రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆమె సయోధ్య కుదుర్చుకోవడం అందరికి విస్మయం కలిగింది.

సయోధ్యకు సూచనగా అన్నట్లుగా అసెంబ్లీలో ప్రసంగించడానికి ముందుగా ఆమె వేదాద్రి దేవాలయంకు వెళ్లి, పూజలు చేసుకొని రావడం, ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా కలెక్టర్ స్వాగతం పలకడంతో పాటు, ఆలయంలో అన్ని మర్యాదలు జరిగాయి.

దీనితో ఆమెకు స్థానసంచలనం తప్పదని బిజెపి వర్గాలలో వినిపిస్తున్నది. అందుకు ఆమె కూడా సిద్ధపడ్డారని, ప్రస్తుతం తాను ఇన్ ఛార్జ్ గా ఉన్న పుదుచ్చేరికి పూర్తిస్థాయిలో నియమించేవిధంగా చేసుకోవడానికి ఆమె ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. మరొ కధనం ప్రకారం ప్రస్తుతం బీజేపీలో చేరిన మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను నీయమిస్తారనుకొంటున్న మహారాష్ట్ర గవర్నర్ పదవిని ఆమె కోరుకుంటున్నట్లు కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కెప్టెన్ అమరిందర్ సింగ్ ను తెలంగాణకు నియమిస్తే, మహారాష్ట్రలో బీజేపీ సారధ్యంలోని కూటమి అధికారమలో ఉండడంతో అన్ని `రాజా మర్యాదలు’ తనకు జరగగలవని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles