గవర్నర్ కు ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదు.. ఆగ్రహంతో సీఎం జగన్!

Saturday, October 19, 2024

2019 ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించడంలో ఎన్నో విధాలుగా సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ-వ్యతిరేక విధానాలు, అణచివేత, నిరంకుశ చర్యల పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.

బహుశా, ఏపీ చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్ ను కలసి ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఎన్టీ రామారావు నుండి ఉద్యోగుల ఆగ్రవేశాలకు గురైన ముఖ్యమంత్రులు ఎవ్వరు ఎన్నికలలో విజయం సాధించక పోవడం గమనార్హం.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు ఆధ్వర్యంలో మొత్తం 8 మంది ప్రతినిధులు గురువారం గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోయినా అధికారులు స్పందించడం లేదని, గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఉద్యోగ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

ఉద్యోగ సంఘ నాయకులు గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేయడంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం చెందారు. వెంటనే ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన బండి శ్రీనివాసరావును పిలిచి మాట్లాడారు. సీఎంను కలసిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు నిబంధనలు పాటించాలని, లేకపోతే వాటి గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

సమస్యలపై పోరాటం చేసే సత్తా లేకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. వారి వెనుక ఏ శక్తి ఉండి నడిపిస్తుందో ఉద్యోగులు గమనిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్నామని, ఇకపై ఇలాగే వ్యవహరిస్తే ఖబడ్డార్ అంటూ బండి హెచ్చరించారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని అంటూ ఉద్యోగులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

కాగా, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందడం లేదని గవర్నర్ ను కలసిన నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం గతంలో పలుమార్లు హామీలు ఇచ్చినా డబ్బులు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సహితం ఎప్పుడూ జీతాలు ఆలస్యంగా చెల్లిస్తుండటం జరగక పోవడం, ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొండడంతో ఉదోగులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని గవర్నర్ కు నివేదించారు.

సరైన సమయానికి జీతాలు వేయకపోవడంతో.. ఈ ఎంఐలు కట్టలేని పరిస్థితి నెలకొందని.. దీంతో చాలామంది సిబిల్ స్కోరు పడిపోయి. బ్యాంకుల్లో అప్పులు కూడా దొరకడం లేదని వివరించారు. ఇంకా చాలానే సమస్యలు ఉన్నాయని.. ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ కు వివరాలు అందించారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్తున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్‌ను విత్‌డ్రా చేశారని.. 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారని పేర్కొన్నారు

ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తామని,ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర కౌన్సిల్‌ నిర్ణయం ప్రకారం ఆందోళన చేపడతామని వెల్లడించారు. ఆర్థిక శాఖ అధికారులు, మంత్రివర్గ ఉపసంఘానికి సమస్యలు చెప్పామని, వారు స్పందించకపోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్‌ను లిసి ఫిర్యాదు చేశారని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles