గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గుండాలు విధ్వంసం

Monday, September 16, 2024

గన్నవరంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాయి. గన్నవరం టీడీపీ  కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీసు ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.  మంటలు ఆర్పేందుకు వస్తున్న ఫైరింజన్లు కూడా అడ్డుకున్నారు.

కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు. ఈ దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఉండగానే చూస్తుండగానే వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.

ఈ విషయంపై పోలీసులను అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించడం గమనార్హం. టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని టీడీపీ అంటున్నారు. పోలీసులు అలసత్వమే కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రెండు రోజుల నుంచి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో సోమవారం వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున చేరుకుంటున్నారు. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

విజయవాడ – గన్నవరం జాతీయ రహదారిపై టిడిపి నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ పార్టీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల మాదిరిగా ఉండిపోయారని టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు.

తాజాగా ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు వెళ్లారు. టీడీపీ నేతలు గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లగానే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. పెట్రోల్‌ డబ్బాలు, క్రికెట్‌ బ్యాట్లతో విరిచుకుపడి ఆఫీసులో అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘర్షణలతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోటాపోటీ నిరసనలు, ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు బలగాలను మోహరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. మరోవంక, ఈ దౌర్జన్య చర్యల పట్ల ఆగ్రహం చెందిన రాష్ట్ర టిడిపి నాయకులు గవర్నర్ ను కలిసి, ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles