గన్నవరంలో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలు సృష్టించిన దమనకాండపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. వైసిపి ఉన్మాదులు అరాచక చర్యలకు పాల్పడుతుంటే పోలీసులు ఏ గాడిదలను కాస్తున్నారు? అంటూ మండిపడ్డారు.
గన్నవరం ఘటనపై ఏపీ డీజీపీకి లేఖ రాశారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా, కొమ్మారెడ్డి పట్టాభిల భద్రతకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అయితే,టీడీపీ నేత పట్టాభి సహా 16మంది టీడీపీ నేతలు కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్‌లోనే ఉన్నట్లు మంగళవారం వెల్లడైంది.
గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై వైసీపీ రౌడీలు దాడి చేసి ధ్వంసం చేశారని, అక్కడ ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంతు చిన్నాకు చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారని, పట్టాభిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారా?.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అని ఇప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు చంద్రబాబు తెలిపారు.
పట్టాభి భార్య చందన హౌస్ అరెస్ట్
ఇలా ఉండగా, కొమ్మారెడ్డి పట్టాభి ఆచూకీ తెలియక పోవడం పట్ల ఆయన భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పట్టాభిని ఎవరు తీసుకెళ్ళారో తెలీదు. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అరగంట సమయంలో నా భర్త పట్టాభి ఎక్కడున్నాడో నాకు తెలియాలి. లేనిపక్షంలో డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా. నా కూతురు రాత్రి నుంచి నాన్న ఇంటికి రాలేదని భయపడుతోంది’’ అని ఆమె మంగళవారం మీడియాకు తెలిపారు.
ప్రజల తరఫున మాట్లాడితే కేసులు పెడతారా? అంటూ అంటూ చందన మండిపడ్డారు. ప్రతి పోలీసు స్టేషన్లకు తమ వాళ్ళను పంపినప్పటికీ పట్టాభి ఎక్కడా లేరని పేర్కొంటూ ఆయనను ఎక్కడ దాచారని చందన ప్రశ్నించారు.పట్టాభి భార్య చందనను హౌస్ అరెస్ట్ చేశారు. డీజీపీ ఆఫీసుకు వెళ్లేందుకు చందన యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను పోలీసులు ఇంటికి తీసుకురావడంతో అమె ఇంట్లోనే నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు.ఆమెను గృహనిర్బంధంలోనే ఉంచారు.
కాగా, గన్నవరం టీడీపీ ఆఫీస్‌తో పాటు టీడీపీ నేతలపై దాడి చేసినట్టు వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న ఓ టీవీ ఛానల్‌లో ఒప్పుకున్నారని తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తెలిపారు. అయితే దాడి చేసిన వారిని వదిలేసి ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంటలో తమకు సమాచారం రాకపోతే డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు.
టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు
సోమవారం సాయంత్రం టీడీపీ నియోజక వర్గ కార్యాలయంపై దాి చేసి విధ్వంసం సృష్టించడంతో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు . వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులు పేరిట కేసులు నమోదయ్యాయి.
గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
టీడీపీ నాయకుడు పట్టాభి, మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. బోడె ప్రసాద్ తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తమ కార్యాలయంపై దాడి చేసి తమపైనే కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు
`చలో గన్నవరం’ కు అనుమతి లేదు
కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టిడిపి అధిష్టానం చలో గన్నవరం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పత్రికా ప్రకటనను విడుదల చేశారు. చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని తెలిపారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 సిఆర్‌పిసి, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉందని తెలిపారు.
ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు అనుమతి లేకుండా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు.
టిడిపి ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామని.. సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.