గత్యంతరం లేకనే బండి సంజయ్, సోము వీర్రాజులకు బీజేపీ అధిష్టానం మద్దతు!

Wednesday, January 22, 2025

రెండు తెలుగు రాష్ట్రాలలో రాష్త్ర పార్టీ అధ్యక్షుల పట్ల బీజేపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. వారిద్దరూ పార్టీ విస్తరణ పట్ల, బలం పెంచుకోవడం పట్ల దృష్టి సారించకుండా తమ వ్యక్తిగత ఎజెండాతో  పనిచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నేరుగా ఈ విషయమై పార్టీ అధిష్టానం వద్దకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేరాయి.

అయినా ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షులను మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా నిరాకరిస్తున్నారు. అందుకే తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చాలని ఎన్ని వత్తిడులు వస్తున్నా తలొగ్గడం లేదు. కేవలం సంజయ్ కారణంగా సీనియర్లు ఎవ్వరూ క్రియాశీలకంగా పనిచేయడం లేదని, పార్టీలో కొత్తవారు చేరడం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదు.

ఫిబ్రవరి 28న అర్ధాంతరంగా ముఖ్య నాయకులను ఢిల్లీకి పిలిపించిన అమిత్ షా కేవలం సంజయ్ మార్పు జరగదని, ఆయనతో సర్దుకొని పనిచేయలేమని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కొద్దీ రోజుల క్రితం ముగ్గురు జాతీయ నాయకులు – తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ సహితం హైదరాబాద్ లో ముఖ్యనాయకులు సమావేశ పరచి సంజయ్ ను మార్చబోరని స్పష్టం చేశారు.

పార్టీలో మరెవ్వరు బలమైన నాయకులుగా ఎదగడానికి వీల్లేకుండా చేయడం కోసం కీలుబొమ్మలుగా పనిచేసే వారినే ముఖ్యమంత్రులుగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా, చివరకు కేంద్ర మంత్రులుగా మోదీ, అమిత్ షా నీయమిస్తూ వస్తున్నారు. మరో గత్యంతరం లేక యోగి ఆదిత్యనాథ్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. దాదాపు ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుల పట్ల పార్టీలో తీవ్రమైన సంతృప్తి నెలకొంటుంది.

ఇటీవల జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మూడు చోట్ల కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఓటమి చెందడం గమనార్హం. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఓ బృందం ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసింది. తమిళ్ నాడులో బిజెపిని వదిలిపెడుతున్న వారంతా ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలైనే దోషిగా చూపుతున్నారు. కర్ణాటక, కేరళలో సహితం పరిస్థితులు అదేవిధంగా ఉన్నాయి.

చివరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కారణంగా ఆయన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిందని విమర్శలు చెలరేగాయి. అయినా పదవి కాలం పూర్తయిన ఆయనను ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగాలని నిర్ణయించారు. అదేవిధంగా ఒక రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని మార్చితే దేశవ్యాప్తంగా మార్చమని వత్తిడులు వస్తాయని భయపడుతున్నారు.

అందుకనే తెలంగాణాలో బండి సంజయ్, ఏపీలో సోము వీర్రాజు వంటి వారి వల్ల పార్టీ నష్టపోతున్నట్లు స్పష్టం అవుతున్నా అసమ్మతికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిని మార్చే సాహసం చేయడం లేదు. పార్టీ అధిష్టానంలో నెలకొన్న ఈ నిస్సహాయ పరిస్థితే వీరిలో అహంకారం పెరుగుదలకు దారితీస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles