1994లో అనూహ్యమైన ఆధిక్యతతో మూడోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన ఎన్టీ రామారావు టిడిపిలో ఎవ్వరూ ఉహించని సంక్షోభం ఎదుర్కొని, పదవినే కాకుండా పార్టీని కూడా పోగొట్టుకోవలసి రావడం తెలిసిందే. అందుకు ప్రధాన కారణం ఆ సమయంలో ఆయన భార్యగా ఉన్న లక్ష్మి పార్వతి ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలలో ఆధిపత్యం వహిస్తూ ఉండటమే. ఆమె చెప్పిందే శాసనంగా మారుతూ రావడమే. ముఖ్యమంత్రి రామారావు సహితం ఆమె మాటలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు అటువంటి పాత్ర వహిస్తున్నారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ఆదేశాలు, పార్టీకి సంబంధించిన అంశాలను ఆయన ద్వారానే బైటకు వస్తున్నాయి.
మంత్రులు, ఎమ్యెల్యేలు, పార్టీ నేతలకు ఆయన ద్వారానే `ఆదేశాలు’ అందుతున్నాయి. సీఎం జగన్ సహితం ఎవ్వరు, ఏ విషయమై వెళ్లినా `సజ్జలను కలవండి’ అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కీలక అధికార కేంద్రంగా మారిన సజ్జల కారణంగానే పార్టీలో చాలామంది ఎమ్యెల్యేలు, సీనియర్ నాయకులకు – సీఎం జగన్ కు దూరం పెరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
తాజాగా ఎమ్యెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పార్టీ నుండి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్యెల్యేలు సహితం సజ్జలపైననే ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. గతంలో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభం లాంటిది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తకుండా చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.
టిడిపిలో ఎన్టీ రామారావు తిరుగులేని నేత అయినప్పటికీ1995లో టీడీపీలో , ఆ పార్టీ ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువై, ఎమ్మెల్యేలను అవమానించి, అవహేళన చేసినట్టు ప్రవర్తించడం వల్ల సంక్షోభం తలెత్తిందని ఆయన గుర్తు చేశారు. పార్టీ పరిరక్షణ కోసం, ఆ పార్టీ శాసనసభ్యులు, నాయకులు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వర్గం ఎమ్మెల్యే లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మీపార్వతిగా సంబోధిస్తుంటే, మరొక వర్గం ఎమ్మెల్యే లు మగ లక్ష్మీపార్వతి అని అంటున్నారన్నారని ఆయన ఎద్దేవా చేశారు. పరిస్థితి చేయి దాటకముందే, మగ లక్ష్మీపార్వతిని పక్కన పెట్టకపోతే నలుగురు కాస్త 40 మంది అయి, ఇంకా ఎక్కువమందిలో అసంతృప్తి పెరిగి అసెంబ్లీలో ఏదైనా ప్రతిపాదన పెడితే పరిస్థితి దారుణంగా ఉండవచ్చునని ఆయన సీఎం జగన్ ను హెచ్చరించారు.
సిబిఐ కేసులలో జగన్ తో పాటు నిందితుడిగా ఉంటూ, జైలులో కూడా కలసి ఉన్న వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మొన్నటి వరకు పార్టీలో, ప్రభుత్వంలో నం 2 గా వెలుగొందారు. కానీ ఇప్పుడు ఏమీ సంబంధం లేన్నట్లు వ్యవహరిస్తున్నారు. సజ్జల ప్రాధాన్యత పెరుగుతూ ఉండటంతోనే విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోతున్నదని అందరికి తెలిసిందే.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలైనా, ప్రభుత్వ పరమైన సంక్షోభాలు ఎదురైనా మంత్రులను, సీనియర్ అధికారులను కాకుండా అందరిని సజ్జలకు రిపోర్ట్ చేయమని సీఎం చెబుతూ ఉండటం పార్టీలో అసమ్మతికి దారితీస్తున్నట్లు స్పష్టం అవుతుంది.