ఏపీలో సీఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా జనసేన పవన్ కళ్యాణ్ సారధ్యంలో సమీకృతం అవుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపేందుకు సిద్దపడుతున్నందున కాపు వర్గాన్ని చీల్చడం ద్వారా జగన్ పరాజయాన్ని అడ్డుకొనేందుకు వ్యూహాత్మకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్న విషయం తెలుసు. ఈ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉంటున్న పలువురు కాపు నేతలను ఆకట్టుకొని, బిఆర్ఎస్ లో కీలక పదవులు అప్పచెప్పారు.
చివరకు ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడిగా జనసేనలో కీలకంగా వ్యవహరించిన చంద్రశేఖర్ ను నియమించారు. త్వరలో విశాఖపట్నంలో ఏపీలో తొలి బహిరంగసభ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీకి సన్నిహితంగా ఉన్న కీలకమైన కాపు నేతలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఏపార్టీలో ఉన్నా ఎన్నికలలో గెలుపొందే యోధుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఇప్పుడు కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలిసింది. గత ఎన్నికలలో టీడీపీ నుండి గెలుపొందిన, రాజకీయంగా మోనంగా ఉంటూ వచ్చారు. వైసీపీలో చేరి, మంత్రిపదవి చేబట్టబోతున్నారనే కథనాలు వెలువడినా కార్యరూపం దాల్చలేదు. దానైతో ఎన్నికలు సమీపిస్తుండంతో తిరిగి టిడిపిలో క్రియాశీలం అవుతున్నట్టు ప్రకటించారు. పైగా, ఇటీవల నారా లోకేష్ ను కలిసి, ఆయన పాదయాత్రలో పాల్గొనబోతున్నట్లు కూడా వెల్లడించారు.
ఇటువంటి తరుణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్యే ఒకరు విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావును కలిసి మంతనాలు జరపడం ఆసక్తి కలిగిస్తున్నది. ఎమ్యెల్యే కెవి వివేకానంద విశాఖపట్నం పర్యటన సందర్భంగా గంటాను కలిశారు. దానితో గంటాను బిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. వైసీపీలో చేర్చుకునేందుకు అంతర్గతంగా సీఎం జగన్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నందున, బిఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా టిడిపికి దూరం చేయాలని వ్యూహాత్మకంగా ఇద్దరు సీఎంలు అడుగులు వేస్తున్నట్లు అర్ధం అవుతున్నది.
గంటా చేరితే బిఆర్ఎస్ కాబోయే రాజధానిగా వైఎస్ జగన్ ప్రకటించిన విశాఖపట్నంలో బలమైన నాయకత్వం లభించినట్లు కావడమే కాకుండా, టిడిపిని బలహీనం చేసిన్నట్లు కాగలదని అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో, వివేకానంద మాజీ సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణను కలవడం సహితం సంచలనం కలిగిస్తున్నది. గత ఎన్నికలలో జనసేన అభ్యర్హ్దిగా విశాఖ నుండి లోక్ సభ ఎన్నికలలో పోటీచేసిన ఆయన, ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో టిడిపి, బీజేపీలలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయనను కూడా బిఆర్ఎస్ లో చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఒక వివాహంలో కలిస్తే, మర్యాద కోసం ఇంటికి వచ్చారని, రాజకీయ చర్చలు జరగలేదని జెడి కొట్టిపారవేసారు. ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయ అంశాలను ప్రస్తావనకు రాకుండా ఉంటాయా?
ఏదిఏమైనా, వచ్చే ఎన్నికలలో జగన్ ను ఓడించాలని పట్టుదలతో ఉన్న కాపు సామజిక వర్గాన్ని టిడిపి వైపు చేరకుండా, అడ్డుకట్ట వేసేందుకు తనవైనా ఎత్తుగడలు వేస్తూ, జగన్ ను ఆదుకొనేందుకు కేసీఆర్ ఏపీలో బృహత్తర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.