ఖమ్మంలో తారస్థాయికి చేరిన బీఆర్ఎస్​లో గ్రూప్ రాజకీయాలు

Tuesday, April 1, 2025

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత తొలి బహిరంగసభను భారీఎత్తున ఖమ్మంలో బుధవారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ధికమంత్రి హరీష్ రావు స్వయంగా పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులను కూడా కలుస్తూ ఇక్కడి నుండి వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు స్పష్టమైన సందేశం ఇచ్చేవిధంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

పైగా, ఈ బహిరంగసభకు కనీసం ముగ్గురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. వారిలో కేరళ సీఎం పి విజయన్ హాజరుకావడం ప్రాధాన్యత నెలకొంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు వామపక్షాలకు ఒకప్పుడు కంచుకోటగా పేరొందాయి. మునుగోడు ఉపఎన్నికలలో వామపక్షాల మద్దతు పొందిన కేసీఆర్, వచ్చే ఎన్నికలలో వారితో కలసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

దాదాపు దశాబ్దపు కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన వామపక్షాలు కేసీఆర్ అండతో తగు ప్రాతినిధ్యం పొందేందుకు ఆరాటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు జిల్లాలో కనీసం చేరొక్క సీటులో పోటీ చేయాలని సిపిఎం, సిపిఐ భావిస్తున్నాయి. స్వయంగా బహిరంగసభలో విజయన్ పాల్గొనడంలో ఒక విధంగా వామపక్షాలకు సహితం బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి.

అయితే ఈ సందర్భంగా బిఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలు అధికార పక్షంకు చికాకు కలిగిస్తున్నాయి. స్వయంగా హరీష్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా ఒక నాయకుడు వస్తుంటే మరో నాయకుడు రావడం లేదు.

ఇల్లెందు నియోజకవర్గంలో మూడు రోజుల కింద నిర్వహించిన సన్నాహక కమిటీ సమావేశానికి  జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యను పిలువలేదు. ఇక కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లోనైతే అధికార బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయి కయ్యానికి కాలుదువ్వుతున్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ మధ్య నిర్వహించిన కార్యక్రమాలకు పలువురు నేతలు దూరంగా ఉంటున్నారు. సన్నాహక సమావేశాలకు దాదాపు 12 మందికి పైగా కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. విడిగా సమావేశాలు పెట్టుకుని జనాలను తరలించేందుకు ప్లాన్​చేస్తున్నారు.

 పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్​ రావులు మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావ్​లను శత్రువులుగానే చూస్తున్నారు. విప్​రేగా కాంతారావుపై పాయం వెంకటేశ్వర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 

ఇక పాలేరు లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలున్నాయి .  సోమవారం ఉదయం పాలేరు నియోజకవర్గంలోని తన వర్గం నాయకులతో తన ఇంట్లో తుమ్మల ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఒక వంక ప్రస్తుత ఎమ్యెల్యేలు తమకు ప్రత్యర్థులుగా ఉన్న వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంటే, మరోవంక పొత్తు అంటూ తమ సీట్లను వామపక్షాలు ఎక్కడ హైజాక్ చేస్తాయో అని ఆందోళన చెందుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles