“క్విట్ సంజయ్” తెలంగాణ బీజేపీలో దుమారం!

Wednesday, January 22, 2025

తెలంగాణాలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావాలంటే ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ పదవి నుండి తప్పించమని ఇతర పార్టీల నుండి వచ్చిన ప్రముఖ నాయకులు పార్టీ అధిష్ఠానంపై అల్టిమేటం ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై నేరుగా హోమ్ మంత్రి అమిత్ షా తోనే తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసిన్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు, ఆ పదవిలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను నియమించామని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయమై తొందరపడవద్దని, అన్ని ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటామని వారికి అమిత్ షా హామీ ఇచ్చిన్నట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత ఈ విషయమై ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారని వినికిడి. 

సంజయ్ ఎంతసేపు తానే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురానున్నట్లు ప్రచారం చేసుకోవడమే గాని ఇతర ప్రజాబలం గల నాయకుల ఉనికిని సహించలేక అపోతున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. నిత్యం మీడియాలో ప్రచారం పొందాలనే ఆరాటం మినహా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, నియోజకవర్గాలలో బలమైన నాయకుల కోసం ప్రయత్నం చేయడం పట్ల దృష్టి సారించడం లేదని ఈ సందర్భంగా విమర్శలు చేస్తున్నారు.

కనీసం ఒక్క ఓటు కూడా కొత్తగా తీసుకురాలేని భజనపరులను వెంట వేసుకుని తిరుగుతున్నారని, అటువంటి వారికే పార్టీ కార్యక్రమాలలో ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ ప్రజాబలం గల నేతలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

ముఖ్యంగా ఇటీవల మునుగోడు ఉపఎన్నికలో తన ఓటమికి సంజయ్ కూడా కొంతవరకు కారణం అని, తప్పుడు నివేదికలు కేంద్రంకు పంపి జాతీయ నాయకులు ఎవ్వరు ప్రచారంలో పాల్గొనకుండా చేశారని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం అస్తవ్యస్తంగా జరగడానికి కూడా అతనే కారణం అని స్పష్టం చేస్తున్నారు.

ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్ లను బూతులు తిట్టడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం ద్వారా తానేదో `హీరో’ అన్నట్లు వ్యవహరించడం గాని వ్యూహాత్మకంగా బిజెపిపై అధికార పక్షం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోలేక పోతున్నట్లు కేంద్ర నాయకత్వం కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణాలో 90 సీట్లు గెలుపొందాలని `మిషన్ 90′ కార్యక్రమం చేపట్టిన బిజేపికి అందులో సగం సీట్లలో కూడా బలమైన అభ్యర్థులు పోటీ చేయడానికి లేకపోవడం గమనార్హం.

సంజయ్ ధోరణి కారణంగా బలమైన నాయకులు పార్టీలో చేరేందుకు వెంటాడుతున్నట్లు కేంద్ర నాయకులు సహితం గమనిస్తున్నట్లు తెలిసింది. కొద్దికాలం క్రితం పార్టీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పార్టీ ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు సహితం అటువంటి అభిప్రాయాలలోనే ఉన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహితం సంజయ్ విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో `నం 2’గా ఉన్న ఈటెల రాజేందర్ కు సారధ్యం అప్పజెప్పితే అధికారపక్షం ఎత్తుగడలను సమర్ధవంతంగా తిప్పికొట్టడమే కాకుండా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బలమైన నాయకులను బీజేపీలో చేర్చేవిధంగా చేయగలమని ఈ సందర్భంగా అమిత్ షాకు ఈ నాయకులు భరోసా ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles