ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విధంగా టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడం, అధికార పక్షం అభ్యర్థి ఒకరు ఓటమి చెందటంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సొంత పార్టీ నుండి జరిగిన క్రాస్ ఓటింగ్ తోనే టిడిపి అభ్యర్థి గెలిచినట్లు స్పష్టం కావడం వారిని మరింత అసహనంకు గురిచేస్తున్నది.
క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారికి గుణపాఠం చెప్పాలని జగన్ పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేసినట్లుగా వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి నియోజకవర్గాలలో ఎమ్యెల్యేలకు సంబంధం లేకుండా వేరేవారిని ఇన్ ఛార్జ్ లుగా నియమించడంతో కొంతకాలంగా పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి.
అయితే తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని, తాను ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టే తనని అనుమానిస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేస్తున్నారు. తాను వైసీపీకి విధేయురాలిగా ఉన్నానని, ఎమ్మెల్సీ ఓటింగ్‌కు ముందు తాను సీఎం జగన్ ను కలిసినట్టుగా శ్రీదేవి చెప్పుకొచ్చారు. అయితే, చంద్రశేఖరరెడ్డి మాత్రం పార్టీ నేతలకు ఓటింగ్ తర్వాత అందుబాటులోకి రావడంలేదు. ఫోన్ లకు స్పందించటం లేదు.
అయితే, టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని, వాళ్ల పేర్ల ఇప్పుడే బయటపెట్టలేమని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సరైన టైమ్ లో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా ఈ ఫలితంతో తాము ఖంగుతినడం లేదనే భరోసా పార్టీ శ్రేణులకు ఇచ్చే ప్రయత్నం చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.
వీరిద్దరిని అనర్హులుగా ప్రకటింపచేసి, ఉపఎన్నికలకు వెళ్లాలని జగన్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, రహస్య ఓటింగ్ జరగడంతో సాంకేతికంగా వారిని అనర్హులుగా ప్రకటించడం సాధ్యం కాదని వెనుకడుగు వేస్తున్నారు. పైగా, వారిద్దరిని అనర్హులుగా ప్రకటిస్తే వైసిపి అభ్యర్థులకు ఓటు వేసిన టిడిపికి చెందిన నలుగురిని, జనసేనకు చెందిన ఒకరిని కూడా అనర్హులుగా ప్రకటించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
వారందరిని అనర్హులుగా ప్రకటించి ఏడు సీట్లలో ఉపఎన్నికలకు వెళితే రెండు, మూడు చోట్ల ఓటమి ఎదురైనా 2024 ఎన్నికలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని జగన్ ను వారిస్తున్నట్లు చెబుతున్నారు.
వైసీపీకి షాక్ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో సీఎం జగన్ ఏం చేయబోతున్నారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. గట్టి హెచ్చరిక సందేశం పంపని పక్షంలో పార్టీపై అదుపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని, సీట్ రాదనుకున్న వారంతా ఎదురు తిరిగే అవకాశం ఉంటుందని కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికలు జగన్ కు ఊహించని సవాల్ ను విసురుతున్నట్లయింది.
క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారి పట్ల వైసిపి మంత్రులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు కొందరు ఎమ్మెల్యేలు తొత్తుగా మారుతున్నారని, ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై చర్చించి ఎవరు తప్పు చేశారో తెలుస్తామంటూ వాళ్లకు ఇక రాజకీయ జీవితం ఉండదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇది బ్లాక్ డే అని విమర్శించారు.