కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధం!

Wednesday, January 22, 2025

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి నేతగా పేరున్న

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ తర్వాత గురువారం ఆయన చేసిన వాఖ్యలు ఇటువంటి సంకేతం ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.

ఇప్పటికే ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే జరిగిన ఉపఎన్నికలలో ఆయన ఓటమి చెందినప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. మరోవంక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న సందర్భంలో ఇతర పార్టీల నుండి ప్రముఖుల చేరికకు బిజెపి ప్రాధాన్యత ఇస్తున్నది.

వెంకటరెడ్డి గతంలో కూడా పలు సందర్భాలలో ప్రధాని మోదీని కలిసినప్పటికీ కేవలం నియోజకవర్గం సమస్యలపైననే కలిశానని చెబుతూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం మోదీ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్డీయే ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు.

జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే నెట్ వర్క్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, టెక్స్ టైల్ పార్కులు, మెట్రో రైల్ కనెక్టివిటీ ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని ప్రశంసించారు. హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ ఫేజ్ – 2 ప్రాజెక్టును ఘట్ కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని ప్రధాని మోదీని కోరినట్లు ఈ సందర్భంగా చెప్పారు.

ఆయన పార్టీ మారేందుకే ప్రధాని మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది. పీసీసీ పదవితో పాటు కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన పార్టీ అంతర్గత కమిటీల్లోనూ ప్రాధాన్యత దక్కపోవటంతో కోమటిరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనటంలేదు.

చివరకు పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగిన సమయంలో కూడా ఆయన పాల్గొనలేదు. దీనికి తోడు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఆయన తమ్ముడు, బీజీపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ పరిస్థితులలో కాంగ్రెస్ లో రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్న వెంకటరెడ్డి బీజేపీలో చేరితే తెలంగాణాలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పర్చితే తమ సోదరులకు మంచి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. పైగా, తాము చేపట్టే కాంట్రాక్టు పనులు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినవి కావడంతో ఆర్ధికంగా కూడా ప్రయోజనకరంగా ఉండగలదని అంచనా వేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ 18,000 కోట్ల కాంట్రాక్టు ఇవ్వడంతోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ ను వదిలి బిజెపిలో చేరారని విమర్శలు పెద్ద ఎత్తున చెలరేగడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles