కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు అధిష్టానంపై ఒత్తిడి

Wednesday, January 22, 2025

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో, బీఆర్​ఎస్​ పొత్తు పెట్టుకోక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేసిన వాఖ్యలు తాజాగా ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఒక వంక రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుపుతూ, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని ప్రచారం చేస్తుండగా, మొన్నటివరకు దూరంగా ఉన్న పార్టీ సీనియర్లు సహితం ఎన్నికలు దగ్గరపడుతూ ఉండడంతో రేవంత్ రెడ్డితో కలసి నడుస్తుండగా, సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వెంకట్ రెడ్డి పేర్కొనడం అశనిపాతంగా మారింది.

గత రెండేళ్లుగా పార్టీపట్ల ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్య తీసుకోవాలని పార్టీ అధిష్టానంపై మరింత వత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించి, బుధవారం ఉదయం తనను కలవాలని కోమటిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.

పైగా, కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తుపెట్టుకునే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా చాలా ఫిర్యాదులు వెళ్లాయి.  పూర్తి స్థాయిలో కోవర్టుగా పని చేస్తున్నారని ఆయనను నమ్మడం వల్ల పార్టీ మునుగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు నేతలు హెచ్చరిస్తున్నారు.

పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుండి అసహనంతో రగిలిపోతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి దిక్కారస్వరం వినిపించారు. ఇప్పటికే, మునుగోడు  ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించడం కోసం, కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి కోసం పనిచేశారని పార్టీ నాయకత్వం నుండి విమర్శలు ఏడుకొంటున్న ఆయన తాజాగా మరోసారి తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని చెబుతూ ప్రతిపక్షాలకు మరో ఆయుధం అందించారు.

తమ్ముడు ఓటమి చెందడమే కాకుండా, బీజేపీలో అంత సౌకర్యంగా లేరని స్పష్టమైన తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగాలని సర్దుబాటు చేసుకొనే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ ప్రకటన పార్టీలోని ఆయన ప్రత్యర్థుల దాడులకు గురయ్యేవిధంగా చేస్తుంది. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ రాదని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రాదనీ తేల్చి చెప్పారు. అంతకాలిస్తే వస్తే 40 సీట్లు రావచ్చన్నారు.

ఒక్క సీటులో కూడా డిపాజిట్ దక్కించుకోలేని కె ఏ పాల్ వంటివారు సహితం అధికారంలోకి వస్తున్నామని రాజకీయాలలో గొప్పలు చెప్పుకొంటారు. అటువంటిది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు అధికారం అసాధ్యం అనడం సహింపలేకపోతున్నారు.  ఆయన ప్రకటన బిఆర్ఎస్ – కాంగ్రెస్ ఒక్కటే అని విమర్శలు గుప్పిస్తున్న బిజేపికి చిక్కిన్నట్లయింది.

 పార్టీకి నష్టం కలిగించేలా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ పార్టీ సీనియర్‌ నేతలు రగిలిపోతున్నారు. సీనియర్ నేతలు హనుమంతరావు, మల్లు రవి, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మరోసారి హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దపడుతున్నారు.

బిఆర్ఎస్ తో కలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుందని, అందుకు కోమటిరెడ్డి ప్రకటనే సాక్ష్యం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని చెబుతూ అందుకే బీజేపీని కెసిఆర్ టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి బిఆర్ఎస్ పోటీ చేస్తుందని పేర్కొంటూ బిజెపి భయంతోనే బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయని విమర్శించారు.

ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పడం అంటే, పరోక్షంగా బిజెపికి మద్దతు ఇవ్వడంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటె, కేసీఆర్ ను ఓడించాలని కోరుకునేవారు ఏ పార్టీ ఓడించగలదనుకొంటే ఆ పార్టీకి ఓటువేసి అవకాశం ఉంటుంది.

అయితే, తాను అలా అనలేదంటూ తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరిస్తున్నారని. సాయంత్రానికల్లా కోమటిరెడ్డి మాట మార్చేశారు.  “నేను చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగతం.. సోషల్ మీడియాలో వచ్చిన సర్వేలను ఆధారంగా చేసుకుని.. తెలంగాణలో ఉన్నట్టుండి ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది.. పార్టీల బలాబలాలేంటీ అన్నది విశ్లేషించాను.” అంటూ చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles