వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆల్రెడీ ప్రకటించారు. అయితే తెలుగుదేశం లోని కొందరు నాయకులు ఆయన పార్టీలోకి రాకుండా మోకాలు అడ్డుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుతో కోటంరెడ్డి ఇప్పటిదాకా మాట్లాడనేలేదని కూడా ఒక పుకారును ప్రచారంలో పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆయనను చేర్చుకోవడం లేదు అని కూడా పుకార్లను వ్యాప్తిలో పెడుతున్నారు. ఒకరకంగా చూసినప్పుడు.. ఇలాంటి ప్రచారం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఒక మైండ్ గేమ్ ఆడుతున్నదనే ప్రచారం కూడా ఉంది.
కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరిక తెలుగుదేశం పార్టీకి అవసరం అని అదే పార్టీలోని కొందరు నాయకులు విశ్లేషిస్తున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాలలో గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపరిమితమైన హవా చూపించింది. జిల్లా మొత్తం స్వీప్ చేసింది. సాంప్రదాయ తెలుగుదేశం నాయకులు ఎవరు ఈ ఓటమిని నిలువరించలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించే దూకుడు రాజకీయ ధోరణులకు ఎదురు నిలవలేకపోయారు. కోటంరెడ్డి తో ఆ లోటు తీరుతుందనే అభిప్రాయం కొందరిలో ఉంది. ప్రతిపక్షం మీద విమర్శలు చేయాల్సి వస్తే పద్ధతిగా మాట్లాడడంతో పాటు అవసరమైతే ఒక మెట్టు దిగి వారికి తగిన భాషలో తిట్టగల సమర్థుడు శ్రీధర్ రెడ్డి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొడాలి నాని లాంటి వ్యక్తి ఏ రకమైన భాషలో తిడతాడో, అదే రకమైన భాషలో సమాధానం చెప్పాలంటే తగిన వ్యక్తులు తెలుగుదేశం లో తక్కువ. అదే ధోరణిలో ప్రతి విమర్శలు చేయగల వారు లేరు. కోటంరెడ్డి రాకతో అలాంటి లోటు తీరుతుంది అనే అభిప్రాయం పార్టీలో పలువురిలో ఉంది. అందుకే కోటంరెడ్డిని తెలుగుదేశంలో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.
స్థానిక సమీకరణలతో స్వార్థంతో కొందరు నాయకులు వ్యతిరేకించవచ్చు గానీ.. చేరిక అవసరమే అంటున్నారు. అయినా.. ఇప్పటికి ఆయన సిటింగ్ ఎమ్మెల్యేనే గనుక.. అధికారికంగా చేరడం అనే లాంఛనం పూర్తి కాలేదని, తెలుగుదేశం ఆయనకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆయనకు నెగటివ్ ప్రచారం అంతా వైసీపీ పుణ్యమేనని కూడా కొందరు వాదిస్తున్నారు.