కొత్త సచివాలయంలో మీడియాపై ఆంక్షలు

Saturday, January 18, 2025

 తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త సచివాలయంలోకి మీడియా ప్రతినిధులు ఎవ్వరు రాకుండా ఆంక్షలు విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రధాన కార్యాలయంలోకి మీడియా ప్రతినిధులు ఎవ్వరు ప్రవేశింపకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా ప్రాంగణం బయటే మీడియా హాల్‌నూ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ లు, మీడియా చిట్ చాట్‌లు అన్ని ఇక అక్కడ్నించే జరగనున్నాయి. అక్కడకు కూడా రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఇతర అసిస్టెంట్లకు రెగ్యులర్గా పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.

కొత్త సచివాలయంలోలోకి మీడియా ఆంక్షలపై జర్నలిస్టుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి వివక్ష తగదని హెచ్చరించాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని, స్వరాష్ట్రంలో ఆంక్షలు విధిస్తే సహించేది లేదని జర్నలిస్టుల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే సచివాలయం ముందు ధర్నాకు దిగుతామని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం హెచ్చరించింది.

ఇన్నాళ్లు తాత్కాలికంగా రాష్ట్ర పరిపాలన భవనంగా కొనసాగిన బీఆర్కే భవన్లోనూ మీడియాపై ఆంక్షలు కొనసాగుతూ వచ్చాయి. కేవలం మంత్రులు ప్రెస్ మీట్ లు పెట్టినప్పుడే జర్నలిస్టులను అనుమతి ఇచ్చారు. ఆంక్షలు తగదని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదు. జర్నలిస్టుల పరిస్థితే ఇట్లా ఉంటే సామాన్యులకు ఎలా? ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు.

ఉన్నతాధికారులను కలవాలి అంటే ముందుగా వారి నుంచి అనుమతి పొందితేనే లోపలకు అనుమతి ఇస్తామని సెక్యూరిటీ తేల్చి చెప్పేది. ఉద్యోగులను కూడా ఐడీ కార్డులు చూపించినా అనుమతించలేదు. ఎన్నోసార్లు వెనుదిరిగిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త సచివాలయంలోనూ  అంతకన్నా నిర్బంధ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మీడియా ప్రతినిధులనే కాకుండా, ఎంపీలు, ఎమ్యెల్యేలు నేరుగా సచివాలయంలోకి  వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. టిపిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలోకి వెళ్ళబోతే భద్రతా సిబ్బంది అనుమతిపలేదు. తాను 20 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నానని.. ఏనాడు సచివాలయానికి వెళ్తే ఆపలేదని రేవంత్ వాపోయారు.

ఒక ఎంపీని సచివాలయంకు కిలో మీటరు దూరంలో ఆపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎంకు, మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ ఒకే రకమైన హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదని,  కేసీఆర్ పోలీసులతో పాలన చేస్తుండని..త మండిపడ్డారు. తప్పకుండా ప్రజలు తిరగబడతారని, కేసీఆర్ ను బొంద పెడ్తరని హెచ్చరించారు.

మీడియాను అగౌరవ పరిచే ప్రభుత్వ వైఖరి మాత్రం సరైంది కాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి తదితరులు రాష్త్ర ప్రభుత్వంకు హితవు చెప్పారు.  సచివాలయమంటే అన్ని రంగాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, చట్ట సభల్లోనే మీడియాకు గ్యాలరీ ఉంటుందని పేర్కొంటూ పరిపాలన కేంద్రంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాకు సముచిత స్థానం లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

పరిపాలనకు, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలకు, ప్రజలు తెలుసుకునే హక్కును కాపాడటానికి సచివాలయం తోడ్పడాలనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని వారు సూచించారు. సమాచార సేకరణ కోసం జర్నలిస్టులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మంచి మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసిందని వారు గుర్తుచేశారు.

కాగా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇతర రాష్ట్రాల  మీడియాను ఆహ్వానించిన  ప్రభుత్వం, తెలుగు మీడియాను అవమానించడంలో అంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. అక్రెడిషన్ కార్డులు కేవలం బస్సుల్లో, రైళ్లలో రాయితీల కోసం మాత్రమే జారీ చేసినవి కావని, జర్నలిస్టుగా గుర్తింపు, ప్రభుత్వ రంగంలో స్వేచ్ఛగా సమాచార సేకరణకు అవి జారీచేయబడిన అసలు ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles