పోలీసుల కళ్ల ఎదురుగానే టిడిపి కార్యకర్తలను టీడీపీ కార్యాలయం వద్దనే కొడుతూ, టిడిపి కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్ కు వెళ్లిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్ట్ చేయడం, తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు చిత్రహింసలకు గురిచేయడం ఏపీలో నెలకొన్న దారుణమైన అరాచక పరిస్థితులను వెల్లడి చేస్తుంది.
హత్యాయత్నం కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడం గమనిస్తే రాబోయే రోజలలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయో స్పష్టం చేస్తుంది. ఒక విధంగా ఏపీకి కొత్తగా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న జస్టిస్ అబ్దుల్ నజీర్ పనితీరుకు పరీక్షగా మారే అవకాశం ఉంది.
తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ పట్టాభి కోర్టులో జరిగిన విషయాన్ని వెల్లడించారు. గుడ్లవల్లేరు పోలీసు స్టేషన్‌లోకి వెళ్లగానే ముఖానికి టవల్ కట్టారని, ముగ్గురు వ్యక్తులు వచ్చి తనను లోపలకు ఈడ్చుకుని వెళ్లారని.. అక్కడ తనను లాఠీతో కొట్టారని తెలిపారు. అరగంట పాటు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. రాత్రంతా పోలీసు స్టేషన్లు మార్చి హింసించారని పేర్కొన్నారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు.
గతంలో ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి, సిఐడి పోలీసులు జరిపిన హత్యాయత్నంను పోలినవిధంగానే ఉంది. సోమవారం గన్నవరంలో జరిగిన ఘటనలకూ, పోలీసులు నమోదు చేసిన కేసులకూ ఏమాత్రం పొంతన లేదు. దొంతు చిన్నకు బెదిరింపులపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులు గన్నవరం పోలీసుస్టేషన్‌కు వెళ్లారు.
గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు టీడీపీ రాష్ట్ర నాయకుడు పట్టాభి అక్కడికి వెళ్లారు. అదే సమయంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. దీనికి నిరసనగా పట్టాభితోసహా టీడీపీ నాయకులంతా 16వ నంబరు జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళనకు దిగారు.
పోలీసుల సమక్షంలో, వారిసహకారంతో వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిపైకి చేరుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగాయి. సోమవారం జరిగిన ఈ సీన్లన్నీ మంగళవారం నాటికి మారిపోయాయి. సీఐ కనకారావుతో పాటు ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభితో సహా పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోసహా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
ఈ ఘటన ఒక విధంగా టిడిపి శ్రేణులలో మొండిపట్టుదలను పెంచేందుకు తోడ్పడుతుంది. వైసిపి అరాచకాలను ఎదురొడ్డి నిలబడే ధైర్యం కలిగిస్తుంది. గన్నవరంలో నెలకొన్న విధ్వంసక రాజకీయాలను ఏడురోడ్డెందుకు పట్టాభిని వచ్చే ఎన్నికలలో బలమైన అభ్యర్థిగా కూడా నిలబెట్టే అవకాశం లేకపోలేదు.