ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి క్యాబినెట్లో మార్పు చేర్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఎన్నికలను ఎదుర్కొనే మంత్రివర్గాన్ని తయారు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడున్న క్యాబినెట్లో అసమర్థులు కొందరిని తొలగించి, ఇప్పటిదాకా మంత్రి పదవులు అవకాశం దక్కని కులాల నుంచి సమర్థులను ఎంపిక చేసి మంత్రి పదవులు కట్టబెట్టాలని.. తద్వారా రాష్ట్రంలో దాదాపుగా అన్ని కులాలకు న్యాయం చేస్తున్నట్లుగా ప్రజల ఎదుట కనిపించాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తమాషా ఏమిటంటే, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలాగా, విస్మరణకు గురైన వర్గాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తుంటే.. అసలు ఆ పార్టీలో ఆ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు లేనే లేరు. ఆ కులాల నుంచి ప్రత్యేకంగా మనుషులని ఏరి, ముందుగా వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి ఆ తరువాత మంత్రి పదవులలో కూర్చోబెట్టాలని జగన్ ప్లాన్. ఈ ఒక్క అంశాన్ని గమనిస్తే చాలు ఇన్ని కులాలను ఇంత కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దూరం పెట్టిందో, విస్మరించిందో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మరో ఏడాదిలో ఎన్నికల పర్వం వస్తుండేసరికి హడావుడిగా కులాల వారీగా మంత్రి పదవులు కట్టబెట్టి, అన్ని కులాలకు తమకు మించి న్యాయం చేసేవారు నేనే లేరని టముకు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
రాష్ట్రంలో రాబోయే మూడు నెలల వ్యవధిలో సుమారుగా 16 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాబోతున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాల వైఎస్ఆర్ కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉంది. ఇన్నాళ్లు పట్టించుకోకుండా వదిలేసిన కులాలపై ఇప్పుడు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ముంచుకు వస్తుంది. కేవలం వారందరికీ మంత్రి పదవులు ఇచ్చారని చెప్పుకోవడానికి తప్ప, ప్రాధాన్యం పరంగా వారికి ఎలాంటి విలువ లేని స్థితిలో ఈ పదవుల పందేరం జరగబోతున్నది. ఎందుకంటే, ఎమ్మెల్సీల ఎన్నికలు నియామకాలు పూర్తి అయ్యే సమయానికి మరో మూడు నెలలు పడుతుంది. అప్పుడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టినప్పటికీ.. ఆ తర్వాత ఎన్నికలకు సుమారు 10 నెలల వ్యవధి కూడా ఉండదు. అంటే, కొత్త మంత్రుల వైభోగం ఏడాది కూడా ఉండదన్నమాట. ఇది కేవలం కులాల కంటి తుడుపు చర్య తప్ప నిజాయితీగా ఆ కులాలకు మేలు చేయాలని అనుకుంటున్న ప్రయత్నం కాదు. ఏదో నామమాత్రంగా పదవులను కట్టబెట్టడం మాత్రమే కాదు గాని.. మంత్రి పదవుల్లో కూర్చున్న వారికి కనీసం సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇస్తే తప్ప ఉపయోగం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ సర్కారులో మంత్రులు అందరూ వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే కేవలం కీలుబొమ్మలు మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఉన్నంతకాలం ఆయన కులాలకు ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ కూడా, ప్రాధాన్యమిచ్చినట్లు ఎలా అవుతుందనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.