జాతీయ స్థాయిలో బీజేపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్యెల్యేల కొనుగోలు ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారుడైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
కొత్త ఏడాదిలో సంకురాత్రికి అటు- ఇటుగా మంత్రివర్గంలో కొద్దిపాటు మార్పులు చేపట్టనున్నారని, ఆ సందర్భంగా రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికీ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నదని కధనాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఒకరిద్దరికి ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.
వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఎమ్యెల్యేల కొనుగోలు కేసు నమోదు చేయడం పట్ల ఆగ్రహంగా ఉన్న బిజెపి అగ్రనాయకత్వం ఫిర్యాదుదారుడైన రోహిత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఈడీని రంగంలోకి దింపడంతో కేసీఆర్ ఈ దిశలో ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఈడీ రెండు రోజులపాటు రోహిత్ రెడ్డిని విచారించింది. తాజాగా, ఈ కేసులో నిండుతుడై ప్రస్తుతం జైలులో ఉన్న నందకుమార్ ను సోమ, మంగళవారం విచారిస్తుంది. కేవలం తనను ఇరికించి, తనపై ఏదో ఒక కేసు నమోదు చేయడం కోసం ఈడీ ప్రయత్నం చేస్తున్నదని రోహిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
“దేశంలో హై స్పీడ్ లో వెళ్తున్న బీజేపీకి బ్రేక్ వేసాను. ఇది బీఆర్ఎస్ సమస్య కాదు..తెలంగాణ ప్రజల సమస్య” అంటూ తనపై బిజెపి చేస్తున్న దాడులను మొత్తం పార్టీకి, తెలంగాణ ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. తనను లొంగదీసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కొత్త కొత్త కుట్రలకు తెరలేపుతోందని రోహిత్ రెడ్డి ఆరోపించారు. నందకుమార్‌ను విచారించి, తనకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇప్పించి తననే ముద్దాయిగా నిలబెట్టే కుట్ర జరుగుతోందని తెలిపారు. అయితే, తనను, తన కుటుంబ సభ్యులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. తగ్గేదే లేదనిస్పష్టం చేశారు.
బీజేపీ జాతీయ నేతల బండారం బయటపెట్టానన్న కోపంతోనే తనను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ఈడీ నోటీసులిచ్చి రెండు రోజులు విచారించారని పేర్కొన్నారు. అందుకనే తాను ఈ విషయమై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఎక్కడా మనీలాండరింగ్ జరగక పోయినా ఈడీ ఏ విధంగా జోక్యం చేసుకొంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. రోహిత్ రెడ్డి సోదరుడు, కొందరు సన్నిహితులపై సహితం ఈడీ దృష్టి సారించి, పరోక్షంగా వత్తిడులు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎమ్యెల్యేల కొనుగోలు కేసు నుండి బైట పడటం కోసమే కేసీఆర్ కుమార్తె కవిత పేరును ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీసుకు వచ్చారని ఆరోపిస్తున్న బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఈ కేసును ప్రధాన ఎన్నికల అస్త్రంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే రోహిత్ రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలలో బిజెపిపై ముప్పేట దాడికి ఉపయోగించుకొనే విధంగా కేసీఆర్ వ్యూహం రూపొందిస్తున్నట్లు అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.