కేసీఆర్ బిజెపి వత్తిడులకు లొంగిపోయారా!

Saturday, January 18, 2025

`ఎదిరిస్తే ఏమి చేస్తారు? ఈడీ, సిబిఐలతో దాడులు జరిపించి కొందరిని జైళ్లలో పెడతారు. అంతేగదా’ అంటూ కొద్దీ రోజుల వరకు ధైర్యంగా మాట్లాడుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అకస్మాత్తుగా బిజెపి వత్తిడులకు లొంగిపోయారా? ఢిల్లీ మద్యం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియానే అరెస్ట్ చేసి, తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తుండడంతో తమ కుమార్తె కవితతో ఆగకుండా కుమారుడు కేటీఆర్, చివరకు తనవరకూ వస్తారని భయపడుతున్నారా?

దేశంలో రాబోయెడిది కిసాన్ సర్కార్ అంటూ బిఆర్ఎస్ పెట్టినప్పటి నుండి చెబుతూ వస్తున్న కేసీఆర్ ప్రతి ప్రసంగంలో కేంద్రంలోని బిజెపి పాలనను తూర్పురపట్టకుండా వదిలి పెట్టడం లేదు. కానీ, అకస్మాత్తుగా ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగసభలో బిజెపి ఊసే లేకపోవడం అధికార పార్టీ నాయకులకు సైతం విస్మయం కలిగించింది.

కేవలం కాంగ్రెస్ పైననే విమర్శలకు పరిమితమయ్యారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో పడవేస్తానని అంటూ చెప్పుకొచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే దళిత బంధు వంటి అన్ని సంక్షేమ పధకాలను  మూలాన పడవేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించిన పార్టీయే అని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం…దళిత బంధుకు జై భీం అంటారని స్పష్టం చేశారు. 

ఒక విధంగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభలలో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రమాదాలు రాగలవో అంటూ చెప్పిన విధంగా కేసీఆర్ మాట్లాడారు.  వాస్తవానికి ఇతర జిల్లాలోకన్నా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాల్లోనే బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కన్నా బిజెపి పలు నియోజకవర్గాలలో ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 

అయినా, ఆ పార్టీ ప్రస్తావననే తన సుదీర్ఘ ప్రసంగంలో తీసుకు రాలేదంటే బిజెపికి `సలాం’ అంటూ సంకేతాలు ఇచ్చినట్లయింది.  కేవలం పది రోజుల క్రితం ఢిల్లీ పాలనాయంత్రంగంపై పట్టుకోసం సుప్రీంకోర్టు తీర్పును నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ తో కలిసి హైదరాబాద్ వచ్చారు.

ఈ ఆర్డినెన్సు ను పార్లమెంట్ లోతాము కూడా వ్యతిరేకిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఉమ్మడిగా బిజెపికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామంటూ ప్రకటనలు చేశారు. అయితే, ఇంతలోనే ఆయన వైఖరిలో పూర్తిగా మార్పు కనిపించడం విస్మయం కలిగిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సహా కేంద్ర నిధులు ఇమిడి ఉన్న పలు పధకాల అమలులో జరిగిన తీవ్రమైన అవినీతి గురించిన చిట్టాలు కేంద్రం వద్ద సిద్ధంగా ఉన్నాయని, నేడో – మాపో అరెస్ట్ లు తధ్యం అంటూ బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ చాలాకాలంగా బెదిరిస్తూ వస్తున్నారు. అయినా కేంద్రంలో చలనం కనబడటం లేదు.

`ఢిల్లీలో దోస్తీ – గల్లిలో కుస్తీ’ అంటూ బిజెపి – బిఆర్ఎస్ సంబంధాలపై కాంగ్రెస్ నాయకులు తరచూ ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ వాస్తవమే అని స్పష్టం అవుతుంది. కర్ణాటకలో ఓటమి తర్వాత దిక్కుతోచని బిజెపి తెలంగాణాలో తన వ్యూహం మార్చిందని, బిఆర్ఎస్ తో కలసి ఉమ్మడిగా కాంగ్రెస్ ను అణగతొక్కేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు సిద్దపడుతోందని ఇప్పుడు భావించవలసి వస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles