ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తనను నిందితుడిగా పేర్కొని, అరెస్ట్ చేసేందుకు విఫల ప్రయత్నం చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కన్నెర్ర చేశారు. కేసు దర్యాప్తు సందర్భంగా విచారణకు సిట్ నోటుసులు జారీచేసిన, హాజరు కాకుండా హైకోర్టు నుండి స్టే ఉత్తరువులతో తప్పించుకొంటూ వచ్చిన అయన, హైకోర్టు సిట్ ఏర్పాటునే కేట్టివేస్తూ, దర్యాప్తును సీబీఐకి అప్పగించిన తర్వాత విజయగర్వంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో కాలుపెట్టారు.
గురువారం ఎక్కువభాగం వచ్చే ఏడాది ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేందుకు అనుసరింప వలసిన వ్యూహాలపైననే సమాలోచనలతో గడిపారు. తెలంగాణలోని నియోజకవర్గాల బీజేపీ కన్వీనర్లు, ఇంఛార్జీలు, విస్తారక్ లు, పాలక్ లతో సమావేశమైన సంతోష్ రాష్ట్రంలో గల 119 అసెంబ్లీ వర్గాలలో 90 సీట్లు గెలుపొందాలని `మిషన్ 90′ లక్ష్యం వారి ముందుంచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. తానేమిటో చూపిస్తానని అంటూ తనపై వచ్చిన ఆరోపణల గురించి సరైన సమయంలో సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. అయితే, ఈ కేసులో తనను ఇరికించడం ద్వారా
తాను ఎవరో తెలియకపోయినా తన పేరు మాత్రం ఇంటింటికి వెళ్లిందని, తెలంగాణలో తన పేరు పాపులర్ అయిపోయిందని అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి పేరుతో గెలిచి.. ఆ తల్లి రొమ్మును గుద్దారంటూ బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలో దుర్మార్గపు పానలను పారద్రొలాలంటూ కార్యకర్తలకు సంతోష్ పిలుపునిచ్చారు. ఇక్కడున్న నాయకులు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి శాపమని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాబోయే ఎనిమిది నెలల్లో ఎన్నికలు రావచ్చని చెబుతూ రాష్ట్రంలో 90 సీట్లు గెల్చుకొనే విధంగా మిషన్ 90 పై ఫోకస్ చేయండంటూ బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలని పేర్కొంటూ ముఖ్యనేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్ పెట్టాలని సూచించారు.
బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబపాలన గురించి ప్రజలకు వివరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల దృష్ట్యా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లుగా ముఖ్య నేతలను నియమించారు. వీరంతా నెలలో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు.
జనవరి 5,6,7వ తేదీలలో ఆయా నియోజకవర్గాలకు బీజేపీ పాలక్‌లు వెళ్లనున్నారు. జనవరి 7న బూత్ కమిటీలతో జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ పర్యటించి, పార్టీ కార్యక్రమంలో పాల్గొన గలరని సంతోష్ చెప్పారు.