మంత్రి మండలి అర్ధాంతరంగా తొలగించి, పార్టీ నుండి బైటకు వెళ్లే పరిస్థితులు సృష్టించినప్పటి నుండి సీఎం కేసీఆర్ ఎప్పుడూ పార్టీ ప్రారంభం నుండి తనతో కలసి ఉద్యమంలో పనిచేయడమే కాకుండా, తన మంత్రివర్గాలలో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తున్న ఈటెల రాజేందర్ ను కనీసం పలకరించలేదు. కనీసం ఏ సందర్భంలో కూడా ఈటెల ప్రస్తావనను మాటలలో కూడా తీసుకు రాలేదు.
ఉపఎన్నికలో గెలుపొంది, తిరిగి అసెంబ్లీకి వచ్చి 13 నెలలైనా మొన్నటి వరకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రెండు సార్లు మొదటిరోజే అసెంబ్లీ నుండి బహిష్కరించి, సమావేశాలు ముగిసేవరకు రానీయలేదు. కానీ, ఈ సారీ బడ్జెట్ సమావేశాలలో మొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇవ్వడం, సమావేశాల మొదటి రోజు స్వయంగా కేటీఆర్, కొందరు అధికార పార్టీ సభ్యులు కూడా దగ్గరకు వచ్చి పలకరించడంతో రాజేందర్ ఖంగు తిన్నారు.
అంతటితో ఆగకుండా, సమావేశాలు చివరి రోజైన ఆదివారం తన ప్రసంగంలో కేసీఆర్ పలు పర్యాయాలు ఈటెల పేరును ప్రస్తావించడం, ఆయన చేసిన సూచనలను అమలు పరచమని మంత్రులను ఆదేశించడం, అవసరమైతే ఆయనను ఆ విషయాలలో సంప్రదించామని సభాముఖంగా సూచించడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది. కనీసం డజన్ సార్లు ఈటెల పేరును కేసీఆర్ ప్రస్తావించడం ఈటెల నాయకత్వంపై బీజేపీలో గందరగోళం సృష్టించడం కోసం వ్యూహాత్మకంగా ప్రయోగించిన అస్త్రంగా స్పష్టం అవుతుంది.
కేసీఆర్ ఈటెల పేరును ప్రస్తావిస్తుంటే `ఘర్ వాపస్’ అంటూ తిరిగి తమ పార్టీలోకి రావాలని సంకేతం ఇస్తూ బిఆర్ఎస్ సభ్యులు హర్షధ్వానాలు చేస్తుండటం తో రాజేందర్ ఆత్మరక్షణలో పడ్డారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.
ఓ సందర్భంలో ‘మిత్రులు రాజేందర్ మాట్లడుతూ అనేక అంశాలను లేవనెత్తారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హాస్టల్‌లో చదివే పిల్లలకు సన్న బియ్యం అందించాలనే ఆలోచన తన మాజీ సహచరుడు ఈటలదేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేసారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని ఈటల కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు.
“రాజేందర్ గారు.. డైట్ ఛార్జీలు పెంచమని కోరారు. అది న్యాయ సమ్మతమైన కోరిక. మనకు సంస్కారం ఉంది. రాజేందర్ గారు చెప్పారు కాబట్టి చేయొద్దు అనొద్దు. వెంటనే ఛార్జీలు పెంచుతూ జీవో జారీ చేయాలి. రెండు మూడ్రోజుల్లోనే మెస్ ఛార్జీలు పెంచాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశిస్తున్నా. కావాలంటే ఈటలకు ఫోన్ చేయండి.. డైట్ ఛార్జీల పెంపు విషయంలో ఆయన సలహాలు కూడా తీసుకోండి” అని మంత్రులకు సీఎం సూచించారు.
తమకు ఎలాంటి బేషజాలు లేవన్నకేసీఆర్ తమకు ఎవరు మంచి సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన ప్రసంగంలో పదే పదే ఈటల పేరును ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. ఓ సందర్భంలో “మా ఈటల రాజేందర్” అంటూ గతంలో మాదిరిగా ఆత్మీయంగా మాట్లాడారు.
కాగా సీఎం కేసీఆర్ పదే పదే తన పేరును ప్రస్తావించడం తన ఇమేజీ డ్యామేజ్ చేసే ఉద్దేశంతోనే ఆ విధంగా చేశారని ఈటెల ఆరోపించారు. తెలంగాణాలో కేసీఆర్ ను ఢీకొనేందుకు బీజేపీలో ఈటెల తగినవాడనే అభిప్రాయం బిజెపి అగ్రనాయకత్వంలో నెలకొంది. అది గ్రహించి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఓ దశలో ఈటెలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది.
అందుకనే, సంజయ్ వర్గం ఈటెల తిరిగి కేసీఆర్ పంచన చేరుతారనే వదంతులను వ్యాపింప చేస్తున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి. తిరిగి పార్టీలో చేరమని బిఆర్ఎస్ నేతలు కొందరు ఆయనను సంప్రదిస్తున్నారనే వార్తాకథనాలు సహితం ఒక సందర్భంలో మీడియాలో వచ్చాయి. అటువంటి కథనాలకు బలం చేకూర్చే విధంగా, బీజేపీ నాయకత్వం ఈటెలను అనుమానాస్పదంగా చూసేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా అసెంబ్లీ సాక్షిగా ఈటెలపై అమితమైన ప్రేమ కురిపించారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.