కేసీఆర్ పై కోపాన్ని సీఎస్ శాంతికుమారిపై చూపిన గవర్నర్ తమిళసై!

Sunday, January 19, 2025

తనకు హోదాకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ప్రోటోకాల్ సమస్యను లేవనెత్తుతూ నిత్యం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఇప్పుడు తన కోపాన్ని ప్రదర్శించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఎంచుకున్నట్లు కనిపిస్తున్నది.

రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు నెలల తరబడి ఆమోదం తెలపడం లేదంటూ గవర్నర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో గవర్నర్ – కేసీఆర్ వివాదం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరుతో ఆ పిటిషన్ ను దాఖలు చేశారు.

ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకున్నారు. బిల్లుల పెండింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దేశవ్యాప్తంగా తమిళిసై దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడింది. 

ఇప్పటికే బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్లు కేంద్రంకు కీలుబొమ్మలుగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రాజ్యాంగపరమైన సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి.

దీంతో తమిళిసైకి ఏం చేయాలో పాలుపోయినట్లు లేదు. బిల్లులను ఎందుకు పెండింగ్‌ పెట్టారో చెప్పాల్సింది పోయి, ప్రభుత్వం తరఫున సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసిన సీఎస్‌ శాంతికుమారిని లక్ష్యంగా చేసుకొన్నారు. ఆమెపై అసహనం వ్యక్తం చేశారు.

బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీకోర్టును కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హోలీ సెలవుల తరువాత విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రాజ్‌భవన్ దిల్లీ కంటే దగ్గరగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

‘ఢిల్లీ కన్నా రాజ్‌భవన్‌ చాలా దగ్గర. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా రాజ్‌భవన్‌కు వచ్చి కలిసేందుకు మీకు సమయం దొరుకలేదా?. ప్రొటోకాల్‌ తెలియదా?. కనీసం మాటవరుసకైనా ఫోన్‌ చేయలేరా?స్నేహపూర్వక వాతావరణంలో చేసే అధికారిక పర్యటనలు, చర్చలు ఎంతో మేలు చేస్తాయి. కనీసం మీకు ఆ ఉద్దేశం కూడా లేదు’ అని సీఎస్‌ శాంతికుమారిని ఉద్దేశించి తమిళిసై ట్వీట్‌ చేశారు. ‘ఢిల్లీ కన్నా రాజ్‌భవన్‌ దగ్గరే ఉన్నది అని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను’ అని మరో ట్వీట్‌ చేశారు.

అయితే వాస్తవానికి జనవరి 11న సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన  శాంతికుమారి జనవరి 26వ తేదీన రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలను పర్యవేక్షించారు. సీఎస్‌ ఆ రోజు ఉదయమే వెళ్లి గవర్నర్‌ను కలిశారు. వేడుకలు పూర్తయ్యే వరకు ఆమెతోనే ఉన్నారు. సాయంత్రం జరిగిన ఎట్‌ హోం వేడుకల్లోనూ సీఎస్‌ పాల్గొన్నారు. అంటే, రోజంతా గవర్నర్‌ పక్కనే సీఎస్‌ ఉన్నారు. అయి నా తమిళిసై అసత్య ప్రచారం చేస్తూ ట్వీట్‌ చేయడం గమనార్హం.

గవర్నర్ ట్వీట్ లను నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. బిల్లులు ఎందుకు పెండింగ్‌ పెట్టారో చెప్పాల్సిందిపోయి రాజకీయ నాయకురాలిలాగా విమర్శలు చేయటం ఏంటని నిలదీస్తున్నారు. ముందు 10 బిల్లులపై సంతకాలు పెట్టాలని చెప్తున్నారు. ‘ట్వీట్లు చేస్తూ కాలం వెళ్లదీసే బదులు బిల్లులను పూర్తిగా చదివి.. ఆమోదించండి లేదా తిరస్కరించండి’ అని సూచించారు. ‘బిల్లు పాస్‌ చేస్తారా.. రాజీనామా చేస్తారా?’ అంటూ విమర్శలు చెలరేగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles