సొంతంగా పాదయాత్ర చేసినా తెలంగాణాలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగలేక పోతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ పై ఉమ్మడి పోరాటాల పేరుతో ప్రతిపక్షాలతో చేతులు కలపడం ద్వారా తన రాజకీయ ఉనికి చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మొదటగా, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఫోనులు చేసి పేపర్ లీకేజి వ్యవహారంపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని, ప్రగత్ భవన్ కు మార్చ్ నిర్వహిద్దామని ప్రతిపాదించారు.అయితే జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్ధ్లులుగా ఉంటున్న ఈ రెండు పార్టీల నేతలు తెలంగాణాలో చేతులు కలపడం `ఆత్మహత్య సదృశ్యం’ అని గ్రహించినట్లున్నారు.
ఆమె ఫోనులకు వారిద్దరూ సానుకూలంగా స్పందించకపోయినా ఆమె తన ప్రయత్నాలను విరమించుకోకుండా అన్ని ప్రతిపక్షాలకు లేఖలు వ్రాసారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలంగాణ జన సమితి, జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మాఆర్ పీఎస్ లతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు తమతో కలిసి రావాలని ఆ లేఖలలో ఆమె కోరారు.
నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తాజాగా మరో ప్రతిపాదనను ప్రతిపక్షాల ముందు పెట్టారు. సోమవారం మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడేందుకు టీ- సేవ్ (స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకన్సీస్, ఎంప్లాయ్ మెంట్) అనే ఫోరాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు.
పార్టీలకు అతీతంగా టీ సేవ్ ద్వారా పోరాటం చేద్దామని ఆమె సూచించారు. ‘‘రాజకీయాల కంటే మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం. ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందిద్దాం. దయచేసి అన్ని పార్టీలు కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని షర్మిల కోరారు.
‘‘హౌజ్ అరెస్టులు చేసి, అక్రమ కేసులు పెట్టి ఎవరూ ప్రశ్నించకుండా, పోరాడకుండా కెసిఆర్ నిరంకుశ సర్కారు నిర్బంధిస్తోంది. అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి, పోరాడితేనే కెసిఆర్ మెడలు వంచగలం. నిరుద్యోగులకు న్యాయం చేయగలం’’ అని షర్మిల చెప్పారు.
ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అయితే మొదటి నుంచి ఆమె రాజకీయ ఎత్తుగడలను తెలంగాణలోని రాజకీయ పక్షాలు అనుమానంగానే చూస్తున్నాయి. ఆమె రహస్య అజెండాతో ఉన్నట్లు అనుమానిస్తున్నాయి. అందుకనే ఆమెతో చేతులు కలిపేందుకు ఎవ్వరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు.
పైగా, ఆమెకు క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన ఉనికి లేకపోవడం, జిల్లాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో ఆమెతో చేతులు కలపడం ద్వారా రాజకీయంగా ఒరిగెడిది ఏమిటనే భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇంతకు ముందు కూడా రాష్ట్ర సమస్యలపై రాష్ట్రపతిని కలుద్దామని ఆమె ప్రతిపక్ష పార్టీల నేతలను కోరారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అధికార బీఆర్‌ఎస్‌కు ఈ మధ్య కాలంలో సీపీఎం, సీపీఐ పార్టీలు దగ్గర య్యాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేగాక వామపక్షాలకు బీజేపీ అస్సలు పడదు.
దేశంలో మతతత్వాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కంకణం కట్టుకుని ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధానంగా మతతత్వాన్నే ప్రధాన అంశంగా ప్రజలను చైతన్యం చేసేందుకు యాత్రలు చేపట్టాయి. కాబట్టి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు ఉమ్మడి పోరాటంలో పాల్గొనే అవకాశాలు లేవని ఈ పార్టీల నేతలు చెప్పారు.