కేంద్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే, అంటే పరోక్షంగా తాను ప్రధాని పదవి చేబడితే ఇప్పుడు తెలంగాణాలో విజయవంతంగా అమలు పరుస్తున్న రైతు బంధు, దళిత్ బంధు వంటి పధకాలను దేశవ్యాప్తంగా అమలు పరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెబుతున్నారు. ఒక విధంగా జాతీయ రాజకీయాలలో కాలుపెట్టేందుకు ఆయన ఎంచుకున్న ముఖ్యమైన నినాదం ఇదే.
అయితే, ఈ పధకాలు తెలంగాణాలో ఎంత ఘనంగా అమలవుతున్నాయి వాస్తవాలు వెలుగులోకి వస్తుండడంతో మైండ్ బ్లాక్ అవుతుంది. తాజాగా మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో, మొదటి 10 నెలల్లో దళితబంధు పధకం క్రింద ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. బడ్జెట్ లో అయితే ఘనంగా రూ 17,800 కేటాయింపులు చూపారు. కానీ ఖర్చు మాత్రం ఒక్క రూపాయి కూడా పెట్టలేదు.
అసలు తనపై తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరి ఉపఎన్నికకు సిద్దమైన ఈటెల రాజేందర్ ను ఓడించడం కోసం హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. తెలంగాణలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
ముందుగా, పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లోని 17వేల దళిత కుటుంబాల బ్యాంకు అకౌంట్లలో ఒక్కో బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేసినట్టు ప్రకటించారు. అయితే ఆ మొత్తలు దళితులకు చేరకుండా ఎన్నికల మార్గదర్శకాల పేరుతో మోసం చేశారు.
ఆ తర్వాత ఒకొక్క నియోజకవర్గానికి1500 మంది చొప్పున దళితబంధు పథకాన్ని మంజూరు చేస్తామని ప్రకటించి, ఆ తర్వాత ఆ సంఖ్యను 200కు తగ్గించారు. ఇప్పుడు వారికి కూడా ఇవ్వడం లేదు. మరోవంక, రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పేరుతో ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ ను ఎస్సీ/ఎస్టీ టి-ప్రైడ్ గా ప్రకటించి ఆ నిధులను కూడా ఎస్సీ, ఎస్టీలకు అందకుండా మోసం చేస్తున్నదని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ధ్వజమెత్తారు.
గతంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడేనని ప్రకటించి మాట తప్పిండని, రాష్ట్రంలో నిరుపేదలైన దళితులందరికీ 3 ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి, వాటికి కావలసిన ప్రాథమిక అవసరాలు కల్పిస్తానని ప్రకటించి, మాట తప్పి తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మారిండని కుమార్ విమర్శించారు.
“బడ్జెట్‌లో మాత్రం రూ.17,700 కోట్లు కేటాయించి.. గత 10 నెలల్లో రూపాయి కూడా తియ్యలేదు. ఒక్కరికి కూడా ఈ పథకం అమలు కాలేదు. ఇది చాలక బీఆరెస్‌కి పగ్గాలిస్తే దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామంటూ దొంగ హామీలిస్తున్నరు. ఇదంతా దళితులను మభ్యపెట్టడం, మోసపుచ్చడం కాక ఇంకేమిటి ?” అంటూ బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారు ఊదరగొడుతున్న ఈ దళితబంధులు, రైతుబంధులు చివరికి బంద్ అవుతాయని తాను గతంలో పలుమార్లు చెబుతూనే వచ్చానని అంటూ ఆమె ఎద్దేవా చేశారు.