కేసీఆర్ కు రాజకీయ ఆయుధంగా ఫాం హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తు !

Wednesday, December 18, 2024

బిజెపిని జాతీయ స్థాయిలో ఆత్మరక్షణలో పడవేసి, ఆ పార్టీ సీనియర్ నేతలకు సహితం అరెస్ట్ భయం కలిగించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. నిందితుల అభ్యర్థనపై ఈ కేసు విచారణను రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలోని సిట్ నుండి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ విధంగా చేయడంతో ఏ ఈకేసులో బిజెపి జాతీయ నాయకులను `ఇరికించేందుకు’ చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతున్నప్పటికీ రాజకీయంగా సీఎం కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉంది. ఎట్లాగూ ఈ కేసులో `నగదు మార్పిడి’ జరిగిన్నట్లు చెప్పడం లేదు కాబట్టి, న్యాయస్థానంలో చివరికి నిలబడటం కష్టమే అని న్యాయనిపుణులు భావిస్తున్నారు. 

అయితే విచారణ పేరుతో ఎన్నికల వరకు బీజేపీ నాయకుల `ఎమ్యెల్యేల కొనుగోలు’ వ్యవహారంపై రాజకీయ  లబ్ది పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కోర్ట్ తీర్పు ఇవ్వగానే కేసీఆర్ సర్కారు అప్రమత్తమైంది. తీర్పును వెంటనే అమలు చేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించింది.

 కేసుకు సంబంధించి తీర్పు ఫైనల్ కాపీ వచ్చే వరకు ఆర్డర్ అమలు  చేయకుండా చూడాలని కోరింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు ఫైనల్ కాపీ వచ్చే వరకు జడ్జిమెంట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. హైకోర్టు డివిజన్ బెంచ్, ఆ తదుపరి సుప్రీం కోర్టు నుండి ఏవిధమైన ఉత్తరువులు వచ్చినా, చివరకు సిబిఐ చేతికి ఈ కేసు  చేజారినా, రాజకీయంగా బిజెపిపై బురద చల్లేందుకు వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉంది. 

ఈ కేసు విచారణను సిబిఐ చేపడితే ఇక ఈ కేసు కంచికి చేరినట్లే అవుతుందని సర్వత్రా భావిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేవలం రాజకీయ ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకోవడం కోసమే నరేంద్ర  మోదీ ఉపయోగిస్తూ ఉండటం తెలిసిందే.   బీజేపీలో చేరితే, ఆ నేతలపై ఎంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ కనీసం విచారణ కూడా జరపడం లేదు. 

పైగా, ఈ కేసులో బీజేపీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ పేరు చోటు చేసుకోవడంతో బిజెపి జాతీయ నాయకత్వం కంగారు పడింది. ఇప్పుడు సీబీఐకి చేరిందంటే ఆయనను కనీసం విచారణకు కూడా పిలిచే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 

స్వయంగా కేంద్ర దర్యాప్తు సంస్థలే దాడుల సందర్భంగా “మీరు బీజేపీలో చేరితే మాకు- మీకు ఇటువంటి ఇబ్బందులు తప్పుతాయి” అంటూ సలహాలు ఇస్తుండటం అనేక సందర్భాలలో వెల్లడి అవుతున్నది. బీజేపీలో చేరిన ఒక ఎంపీనే మహారాష్ట్రలో తాను బీజేపీలో చేరడంతో సుఖంగా  నిద్ర పోగలుగుతున్నానని, తనను ఏదో దర్యాప్తు సంస్థ విచారిస్తుందనే భయం ఇప్పుడు లేదని కొద్దికాలం క్రితం చెప్పడం గమనార్హం. 

ఈ కేసును చేధించేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన్నప్పటి  నుంచి సిట్ దర్యాప్తును బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తోంది. సిట్ విచారణపై అనుమానాలున్నాయని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు, హైకోర్టును కోరారు. న్యాయవాదుల వాదనలు ఏకీభవించిన న్యాయస్థానం సీబీఐకి ఆర్డర్ చేస్తూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 

ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ విచారణ చేస్తుంది. ఇప్పుడు ఈ కేసును హైకోర్టుకు అప్పగించడంతో విచారణను తిరిగి మొదటి నుంచి విచారించే అవకాశం ఉంది. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే ఒక సిట్ కు డీజీపీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి. దానితో సిట్ విచారణకు నిందితులు మొదటి నుంచి సహకరించడం లేదు. 

మొదటి నుండి ఈ కేసు సీబీఐకి చేరుతుందని, అప్పుడు దర్యాప్తు అంటూ ఏమీ ఉండకపోవచ్చని నిందితులు, బిజెపి నేతలు భరోసాతో ఉన్నట్లు ఉన్నారు. ఇప్పుడు ఈ కేసు విచారణను సీబీఐ చేబడితే బి ఎల్ సంతోష్ తో సహా కీలక బిజెపి నేతలు ఎవ్వరిని కనీసం విచారణకు కూడా పిలిచే అవకాశం ఉండకపోవచ్చు. 

అటువంటి పరిస్థితిని ఆసరాగా చేసుకొని, సిట్ తో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే తమ ఎమ్యెల్యేల కొనుగోలు బాగోవతం బైటపడుతుందనే భయంతో సిబిఐకి బదలాయించుకున్నారని కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రచారం చేసే అలవాటు ఉంది. బిజెపి ట్రాక్ రికార్డు  గమనిస్తున్నవారికి ఆయన ప్రచారం నిజమే అని విశ్వసించే అవకాశం లేకపోలేదు. 

 వాస్తవానికి మునుగోడు ఉపఎన్నికకు సరిగ్గా వారం రోజుల ముందు ఈ కేసు బైటపడింది.  దానితో ఒక విధంగా బిజెపి ప్రచారం నైతికంగా డీలా పడినట్లు స్పష్టం అవుతుంది. చివరి రోజు బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రసంగించ వలసిన బహిరంగ సభను రద్దు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు నాయకుల పర్యటనలను సహితం రద్దు చేసుకున్నారు. బిజెపి అభ్యర్థి ఓటమిలో ఈ కేసు సహితం మానసిక ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles