కేసీఆర్ కు టీడీపీ నుండి పెను ముప్పు తప్పదా!

Friday, November 22, 2024

ఖమ్మంలోటిడిపి జరిపిన బహిరంగసభకు అనూహ్య ప్రజా స్పందన లభించడంతో తెలంగాణ రాజకీయాలలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు వర్గాలలో తిరిగి టిడిపి వైపు ఆసక్తి వ్యక్తం అవుతున్నది. ఈ స్పందన ఎన్నికల నాటికి రాజకీయంగా సీఎం కేసీఆర్ కు పెను సవాల్ గా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తిరిగి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే బిఆర్ఎస్ ఎత్తుగడలను చిత్తుచేసే సామర్థ్యం ఇప్పుడు టిడిపిలో కనిపిస్తున్నది.  రాష్ట్రంలో తాజా అంచనాల ప్రకారం కనీసం 40 సీట్లలో గెలుపోటములను టిడిపి ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు.

ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలుచుకోవాలని, హంగ్‌ అంటూ ఏర్పడితే చక్రం తిప్పవచ్చని టిడిపి పార్టీ నేతలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల అనంతరం తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటులో టిడిపి నిర్ణయాత్మక పాత్ర వహించే విధంగా కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన కూడా 2014 ఎన్నికల్లో ఆంధ్రా పార్టీ అని విమర్శలు ఉన్న టీడీపీ స్వయంగా 15 సీట్లు గెల్చుకోవడంతో పాటు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న బిజెపి ఐదు సీట్లలో గెలుపొందింది. అంతేగాక చాలా నియోజకవర్గాల్లో రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్వ ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో గెలవడం విశేషం. మరో 10 నియోజకవర్గాలలో రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణలో పోయిన ప్రతిష్టను తిరిగి సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడు పక్షం రోజులకోసారి తెలంగాణ పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతూ గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు స్థానంలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించి తన లక్ష్యాన్ని చెప్పకనే చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలు, యాదవులు, మున్నూరు కాపులు, ముస్లింలు, ముదిరాజ్‌ సామాజిక వర్గాలకు చెందిన వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో ఈ వర్గాలు సగం ఉంటాయి. కాసాని బాధ్యతలు తీసుకున్న తర్వాత ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వస్తున్నారు.

గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన కమ్మ, బీసీ సామాజిక వర్గాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాకతో ఆ పార్టీ వైపు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో సగం మంది టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం.

వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు వస్తే సరి లేకపోతే పరిస్థితేంటి? అనివార్యంగా టీడీపీ తరపున పోటీ చేసే పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తంమీద 30 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుకు టిడిపి అడ్డుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles