కేటీఆర్ బర్తరఫ్ కై సంజయ్, రేవంత్ రెడ్డిల ఆరాటం!

Monday, December 23, 2024

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బిజెపి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కూడబలుక్కున్నట్లు ఐటి మంత్రి కేటీఆర్ పై గురిపెడుతున్నారు. వాస్తవానికి పేపర్ లీకేజీతో కేటీఆర్ కు ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయిన్నప్పటికీ కంప్యూటర్ ద్వారా లీక్ కావడంతో ఐటి మంత్రిదే బాధ్యత అని, ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని అంటూ ఒక వంక బండి సంజయ్, మరో వంక రేవంత్ రెడ్డి నిత్యం ప్రకటనలు ఇస్తున్నారు.

రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి లీకేజిలో కేటీఆర్ పిఎ తిరుపతి పాత్ర కూడా ఉన్నదంటూ హైకోర్టులోనే పిటిషన్ వేశారు. కేటీఆర్ కార్యాలయం నుండే మొత్తం లీకేజీ వ్యవహారం జరుగుతున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కు రాజకీయ వారసుడు కేటీఆర్ కావడం, వచ్చే ఎన్నికల తర్వాత తిరిగి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి కాగలరని ప్రచారం జరుగుతూ ఉండడంతో రాజకీయ లబ్ధికోసమే కేటీఆర్ ను గురిపెడుతూ విమర్శలు గుప్పిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

దేశంలోని అన్ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ల పనితీరు అధ్వాన్నంగా ఉంటున్నది. ఒకటి కమీషన్ సభ్యులుగా రాజకీయ నీయమకాలు జరుగుతూ ఉండటం ప్రధాన కారణం కాగా, వాటికి అవసరమైన సిబ్బంది, వనరులు లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

కేంద్రంలోని యుపిఎస్సి నిర్వహించే పరీక్షలకు సంబంధించి ఇటువంటి ఆరోపణలు రాకపోతుండటం గమనార్హం. లీకేజికి కారణమైన అంశాలపై లోతైన అధ్యయనం కోసం ఏపార్టీ కూడా  ప్రయత్నించకుండా,ఎన్నికల సంవత్సరం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడిపై బురద చల్లి రాజకీయ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారు.

లీకేజికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంజయ్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు తాము చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇచ్చి, విచారణకు సహకరించమని లీకేజిపై దర్యాప్తు చేస్తున్న సిట్ నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతున్నారు. సిట్ కేసీఆర్ కీలుబొమ్మ అంటూ, తమకు నమ్మకం లేదంటూ ప్రకటనలు ఇస్తున్నారు.

పైగా, తాను గాని, రేవంత్ రెడ్డి గాని జనంలో విన్న మాటలు చెబుతున్నాం గాని, వాటికి మమ్ములను ఆధారాలు అడిగితే యెట్లా? దర్యాప్తు సంస్థలే ఆధారాలు సేకరించాలి.. అంటూ సంజయ్ అత్యంత దివాలాకోరు సమాధానం ఇస్తున్నారు.

 అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈడీ సామాన్లు ఇస్తే సీఎం కుమార్తె కవితను మాత్రం ముందే వీరు దోషిగా చిత్రీకరిస్తున్నారు. ఈడీ పిలిచింది అంటే అరెస్ట్ చేయడానికి కాకుండా ముద్దు పెట్టుకోవడానికా అంటూ సంజయ్ చాలా అసభ్యంగా మాట్లాడి సొంత పార్టీ వారినుండి నిరసనలు ఎదుర్కొన్నారు.

కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను గత తొమ్మిదేళ్లుగా భర్తీ చేయకుండా కీలకమైన విభాగాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలకమైన పన్ను వసూళ్లు జీఎస్టీ ని సహితం ఔట్ సోర్సింగ్ చేస్తూ బడా బడా వ్యాపారులు వేలకోట్ల రూపాయాల పన్నులు ఎగ్గొట్టేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

. కమిషన్లో ఉండాల్సిన దానిలో సగం ముందే రెగ్యులర్ ఎంప్లాయిస్ కాగా, మిగతా వారంతా ఔట్ సోర్సింగ్ వారే. రిక్రూట్ మెంట్ పనులు, కాన్ఫిడెన్షియల్ వర్క, లీగల్ పనుల కోసం టీఎస్పీఎస్సీకి సుమారు 400 మంది వరకు ఉద్యోగులు అవసరం. కానీ ప్రస్తుతం 165 మందితోనే నెట్టుకొస్తున్నారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)లో రెండు వేల నుంచి నాలుగు వేల వరకూ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అక్కడ సుమారు 1,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఏటా 4 వేల వరకూ ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్పీఎస్సీలో 200 మంది కూడా లేకపోవడం గమనార్హం. కీలకమైన అంశాలను, మూల కారణాలను వెలికితీసి, భవిష్యత్ లో ఈ విధంగా పేపర్లు లీక్ అయ్యేందుకు అవకాశం లేకుండా రాజకీయ నేతలు దోహదపడితే ఎంతో సేవచేసిన్నల్టు అవుతారు. కానీ, రాజకీయ బురదతో మరింత కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles