కేకే కుమారులపై మహిళా ఎన్ఆర్ఐ భూ కబ్జా కేసు?

Sunday, December 22, 2024

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్ డా. కె కేశవరావు  కుమారులపై ఓ మహిళా ఎన్ఆర్ఐ భూములను కబ్జా చేశారనే ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని తన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించడంతో కోర్టు ఉత్తరువు  ఫలితంగా ఎంపీ కేశవరావు ఇద్దరు కుమారులపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 

కొద్దిరోజుల కిందటే ఈ వ్యవహారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. జి. జయమాల అనే మహిళా 35 ఏళ్లుగా అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. 1983 లో షేక్​ పేట మండలం సర్వే నంబర్​403లో 939 గజాల స్థలాన్ని పి.సుదర్శన్​రెడ్డి అనే వ్యక్తితో కలిసి షేక్ అలీఖాన్​ అహ్మద్​ నుంచి కొనుగోలు చేశారు. 

పి.సుదర్శన్​రెడ్డి అనే వ్యక్తి చనిపోయారు. ఇందులో సుదర్శన్‌రెడ్డి దక్షిణం భాగంవైపు ఉండగా, జయమాల ఉత్తరం(469 గజాలు) వైపు భాగాలు తీసుకున్నారు. జయమాలకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావటంతో అసలు విషయం బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. 

గతేడాది బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 13లోని జయమాల నివసించిన ఇంటికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ అయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2,13,67,500లకు స్థలాన్ని విక్రయించారని పేర్కొన్నారు. 

పెట్టుబడి మీద వచ్చిన లాభానికి సంబంధించి చెల్లించాల్సిన పన్ను, పెనాల్టీ రూ.1,40,41,300 చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసులు అందుకు ఆమె తాను కొన్న స్థలం ఎంపీ కేశవరావు కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ తిన్నారు.

2019లో ఎంపీ కే కేశవరావు కుమారుడు, తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ విప్లవ్ కుమార్‌కు స్థలంపై అధికార హక్కులతో కూడిన స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తాను ఇచ్చినట్లు ఉన్న పత్రాలను జయమాల గమనించారు. విప్లవ్​కుమార్​ స్పెషల్​ పవర్​ ఆఫ్​ అటార్నీ హోల్డర్​ ను అంటూ తన సోదరుడు వెంకటేశ్వరరావుకు కేవలం రూ.3 లక్షలకు అమ్మినట్లు తేలింది. 

సంబంధిత పత్రాలను జయమాల చూడగా అవి ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. అయితే పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు కాకపోవటంతోనే తాజాగా ఆమె అడిషనల్​ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్​ కోర్టుని ఆశ్రయించారని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో విచారించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

గత నెల 13వ తేదీ కేసు నమోదైనప్పటికీ విషయం బయటికిరాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో కేకే కుమారులైన విప్లవ్‌కుమార్‌ ఎ-1, వెంకటేశ్వర్‌రావును ఏ2గా చేర్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల నుంచి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles