సంక్రాంతి తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయవచ్చని వినపడుతున్న దృష్ట్యా తెలంగాణ నుండి మరొకరికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుండి మంత్రివర్గంలో కేవలం జి కిషన్ రెడ్డి మాత్రమే కేబినెట్ హోదాతో ఉన్నారు. ఏపీ నుండి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గత ఏడాది ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదు.
ఈ ఏడాదిలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండబోవడం, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉండడంతో ఓటర్లపై ప్రభావం చూపే విధంగా మరొకరిని మంత్రివర్గంలో చేర్చుకొని ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడేళ్ళ పదవీకాలం పూర్తవుతున్న దృష్ట్యా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు పార్టీ నాయకత్వం అప్పచెప్పి, సంజయ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని కథాగానాలు వచ్చాయి.
అయితే, పార్టీ నాయకత్వంలో ఇప్పటిలో మార్పు ఉండబోదని స్వయంగా కిషన్ రెడ్డి ప్రకటించడం గమనార్హం. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ సహితం మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలలో, పార్టీ శ్రేణులలో ఎటువంటి పట్టు లేకుండానే ఇప్పటికే ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వం, పార్లమెంటరీ బోర్డు సభ్యత్వం, కేంద్రం ఎన్నికల కమిటీ సభ్యత్వం ఇవ్వడంతో ఇంకా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఢిల్లీలో గల పలుకుబడితో నిజామాబాద్ ఎంపీ డి అరవింద్ సహితం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నా, బండి సంజయ్, డా. లక్ష్మణ్ లతో పాటు అరవింద్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, పదవులు అన్ని ఆ వర్గానికేనా అనే ప్రశ్నలు పార్టీ వర్గాలలో తలెత్తుతున్నాయి. అందుకనే ఆదిలాబాద్ ఎంపీ సాయం బాబురావును మంత్రివర్గంలో తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గత ఏడాది మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలోనే అందుబాటులో ఉండాల్సిందిగా బాపూరావుకు సూచించిన అధిష్టానం పలుకారణాల చేత మంత్రి పదవి ఇవ్వలేక పోయింది. ఈసారి ఆదివాసీ-గిరిజన సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఖరారు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణాలో ఎస్సి, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో అత్యధికంగా ఏ పార్టీ గెల్చుకుంటే, అదే పార్టీ అధికారంలోకి రావడం నానుడిగా వస్తున్నది. బిజెపి సహితం ఆ విధంగా రిజర్వ్ అయినా 36 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్ ఛార్జ్ లను నియమించి, విశేషంగా దృష్టి సారిస్తోంది. గిరిజన నేతగా పేరున్న బాబురావును మంత్రివర్గంలోకి తీసుకుంటే ఈ నియోజకవర్గాలపై ప్రభావం ఉండే అవకాశం ఉండగలదని భావిస్తున్నారు.