ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని మోడీ సర్కారు పట్ల వినయవిధేయతలను ప్రదర్శిస్తుంటారరు. మోడీని కలిసే ఏ సందర్భం వచ్చినా సరే.. ఆయన పాదాలు ముట్టుకుని తన భక్తిని ప్రదర్శించే ప్రయత్నంలో ఉంటారు. అలాంటి నాయకుడు, మోడీ అనుసరిస్తున్న రాజకీయ ఉదార విధానాల్ని మాత్రం ఎందుకు గమనించడం లేదు? ఎందుకు అలవాటు చేసుకోవడం లేదు? అనే సందేహం పలువురికి కలుగుతోంది. కేంద్రంలో ప్రభుత్వం మీద నిశిత విమర్శలు గుప్పిస్తూ రాహుల్ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తోంటే.. దానికి సర్కారు ఎంతో పటిష్టమైన భద్రత కల్పిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో మాత్రం.. ప్రతిపక్ష నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర కు సిద్ధమవుతుండగా అసలు అనుమతులే ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తోంది. మోడీని చూసి జగన్ నేర్చుకోవచ్చు కదా.. అని ప్రజలు అంటున్నారు.
రాహుల్- లోకేష్ పాదయాత్రలను పోల్చిచూసినప్పుడు కొన్ని అంశాలు కనిపిస్తాయి. రాహుల్ కేంద్రంలో ప్రధాని అభ్యర్థి. చాలా పార్టీలు కోరుకుంటున్నట్లుగా భాజపాయేతర కూటమి విజయం సాధిస్తే అందులో ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చే కీలక పేర్లలో రాహుల్ ఉంటారు. అంటే ప్రధాని నరేంద్రమోడీకి డైరెక్ట్ పోటీదారు అన్నమాట. తనకు పోటీదారు కాగల వ్యక్తి ప్రజల్లోకి వెళితే, ప్రజల్లో పాదయాత్ర చేసి వారి కష్టనష్టాలని గమనిస్తే, వారితో మాట్లాడితే.. తన ప్రతిష్ఠ పలచబడిపోతుందని, తనకు నష్టంజరుగుతుందని మోడీ భయపడడం లేదు. అసలు రాహుల్ పాదయాత్రను ఆయన అసలు పట్టించుకోవడం లేదు. ప్రజలతో కలిసి పోరాడడానికి ప్రతిపక్షాలు ఎంచుకునే ఒక సహజమైన మార్గంగానే మోడీ , ఆ పాదయాత్రను కూడా చూస్తున్నారు. అంతే తప్ప అనవసరమైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పైగా తన పాలన ప్రజారంజకంగా ఉందని, దేశసంక్షేమాన్నే కాంక్షిస్తున్నదనే నమ్మకం మోడీలో ఉన్నప్పుడు.. ఎవరెన్ని బూటకపు ప్రచారాలతో తనమీద బురదచల్లుతూ ప్రజల్లోకి వెళ్లినా భయపడే అవసరం లేదని మోడీకి తెలుసు.
కానీ జగన్ విషయం అలా లేదు. ప్రతిపక్షాలు నోరెత్తితే చాలు.. జగన్ సర్కారు వణికిపోతోంది. ప్రతిపక్ష నాయకులు వెళ్లి ప్రజలను కలుస్తోంటే చాలు.. గాభరా పడిపోతున్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్లనే కూడదు. ఇళ్లలోనే కూర్చుని రాజకీయం చేస్తూ ఉండాలి.. అన్నట్లుగా జగన్ ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది. మోడీకి ఉన్న ధైర్యం, ఉదారవాద వైఖరి జగన్ లో లేకపోవడం అంటే.. ఆయన పాలన మీద ఆయనకు నమ్మకం లేకపోవడమేనని పలువురు విశ్లేషిస్తున్నారు.
కేంద్రాన్ని చూసి ఏపీ సర్కార్ నేర్చుకోవాలి!
Friday, December 5, 2025
