కేంద్రం మోకాలడ్డడంతో విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో కేసీఆర్ వెనుకడుగు!

Wednesday, December 18, 2024

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ద్వారా జాతీయ రాజకీయాలలో మోదీని ఎదుర్కోగల మొనగాడు తానే అనే సంకేతం ఇవ్వడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామంటూ హడావుడి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చివరకు తోక ముడిచారు. ఈ విషయంలో ఇంకా డ్రామా కొనసాగిస్తే సొంతరాష్ట్రంలోనే ప్రతికూలత ఎదురవుతుందనే భయంతోనే బిడ్డింగ్ లో పాల్గొనలేదని స్పష్టం అవుతుంది.

ముడిసరుకు (ఐరన్‌ ఓర్‌, కోల్‌) లేదా వర్కింగ్‌ క్యాపిటల్‌ (డబ్బు) అడ్వాన్స్‌గా ఇస్తే దానికి బదులుగా స్టీల్‌ను ఉత్పత్తి చేసి ఇస్తామని, అందుకు ఆసక్తి కనబరచాలని పేర్కొంటూ స్టీల్‌ యాజమాన్యం ఇటీవల పిలిచిన బిడ్లకు 29 టెండర్లు దాఖలయ్యాయి. వాస్తవానికి ఈ నెల 15న తుది గడువు కాగా మరో ఐదు రోజులు పొడిగించాలని తెలంగాణకు చెందిన సింగరేణి కంపెనీ ప్రతినిధులు స్టీల్‌ యాజమాన్యాన్ని కోరగా ఈ నెల 20 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఏ  విధంగా చూసినా తామే వేసే బిడ్డింగ్ స్క్రూటినీ లోనే  తిరస్కారంకు గురవుతోందని అధికారులు స్పష్టం చేయడం, మరోవంక రాజకీయంగా తెలంగాణాలో ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలు ఇచ్చిన్నట్లవుతుందని గ్రహించడంతో బీడ్ వేసి నవ్వులపాలు కావడంకన్నా మౌనంగా ఉండడమే ఉత్తమమని కేసీఆర్ గ్రహించిన్నట్లు కనిపిస్తుంది.

బిడ్డింగ్‌లో పాల్గనేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వం మోకాలడ్డింది. సింగరేణి కాలరీస్‌ సంస్థ ద్వారా బిడ్డింగ్‌ వేయాలంటే అందులో 45 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని మెలిక పెట్టినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్వయంగా జోక్యం చేసుకుని ఇకపై ముందుకెళ్లవద్దని సింగరేణి ఉన్నతాధికారులను హెచ్చరించినట్లు చెబుతున్నారు.

బిడ్డింగ్‌కు సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారులు కేంద్ర పెద్దలను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు తెలిసింది. దీంతో చేసేదేమీలేక తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు సమాచారం.

ఒకవేళ కేంద్రం అనుమతి ఇవ్వకుండా బిడ్ దాఖలు చేసినా టెక్నికల్ బిడ్ల స్థాయిలోనే తెలంగాణ వేసే టెండర్ తిరస్కరణకు గురవుతుంది. అదే జరిగితే తెలంగాణకు కనీసం టెండర్ వేయడం కూడా రాదనే అపప్రద ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరహాలోనే తెలంగాణలోని నిజాం షుగర్స్ సహా ఇతర సంస్థలు తిరిగి తెరిపించాలనే డిమాండ్ ప్రజల నుంచి వెళ్లువెత్తే అవకాశముంది. అదే జరిగితే ఎన్నికలకు ముందు కొత్త సమస్యలు కోరితెచ్చుకున్నట్టు అవుతోందని కేసీఆర్ వెనుకడుగు వేసిన్నట్లు స్పష్టం అవుతుంది.

అందుకనే, బిడ్డింగ్‌లో పాల్గంటామని అధికారికంగా ప్రకటించిన సిఎం కెసిఆర్‌ బిడ్డింగ్‌ సమర్పణకు గడువు ముగిసిన తర్వాత కూడా స్పందించలేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు సిఎంఒ అధికారులు కూడా ఆసక్తి చూపలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles