కేంద్రం ప్రస్తావన లేకుండా ప్రసంగించిన గవర్నర్ తమిళసై

Friday, November 22, 2024

గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై తన దూకుడు తగ్గించుకున్నారా? తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి అత్యుత్సాహంతో రాష్ట్రం పేరునే మార్చివేస్తూ గందరగోళం సృష్టించి, కేంద్రం నుండి చివాట్లు చినవలసి రావడంతో, ఆమె తన ధోరణి మార్చుకున్నారా? శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో రెండేళ్ల తర్వాత బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ప్రసంగం తీరు గమనిస్తే ఇటువంటి అనుమానాలు కలుగుతాయి.

బహుశా గత మూడేళ్ళలో కేంద్రాన్ని ప్రస్తావించకుండా, ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంకు ఆమె పరిమితం అయ్యారు. తన ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఆమెకు, కేసీఆర్ కు మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతూ ఉండగా, రాష్ట్ర హైకోర్టు జోక్యంతో సయోధ్య కుదరడం తెలిసిందే.

అసెంబ్లీలో ప్రసంగించామని రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆహ్వానించడం, ఆమోదం తెలపకుండా జాప్యం చేస్తున్న బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పత్రాలకు ఆమె ఆమోదం తెలపడం … అన్ని  గంటల వ్యవధిలో జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏ విధంగా ప్రసంగిస్తారో అని అందరూ ఆసక్తిగా చూసారు.

ఆమెకు స్వయంగా కేసీఆర్ స్పీకర్ తో పాటు స్వాగతం పలికారు. పైగా, ఆమె అసెంబ్లీలో ప్రసంగించడానికి ముందు యాదగిరిగుట్టకు వెళ్లి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకొని వచ్చారు. అక్కడ  గవర్నర్ తమిళిసై కి యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ మధ్య  తాను ఎక్కడికి వెళ్లినా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, కలెక్టర్, ఎస్పీ తనకు స్వాగతం పలకడం లేదని ఆమె విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బహుశా మొదటిసారిగా ఆమెకు కలెక్టర్ స్వాగతం పలికారు.

అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదిగిందన్ని తమిళిసై అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రూపుదాల్చిందని ఆమె పేర్కొన్నారు.

గవర్నర్ తమిళిసై బయటేమో పులిలా గాండ్రించారని.. తీరా అసెంబ్లీ లోపలికి వెళ్లాక పిల్లి తీరుగా ప్రసంగించారంటూ కాంగ్రెస్ శాసన సభ్యుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌కు గత్యంతరం లేకే అలా మాట్లాడారని,గవర్నర్‌కు కేసీఆర్‌కు మధ్య రాజీ కుదిరిందని జగ్గారెడ్డి ఆరోపించారు. గవర్నర్ పెద్ద పెద్ద మాటలు చెప్పి.. ప్రసంగంలో తుస్సుమనిపించారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌, బీజేపీకి గవర్నర్ బీటీంగా మారిపోయారంటూ ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే గవర్నర్‌ నడిచారని అంటూ ఒకవేళ అలా మాట్లాడకపోతే గవర్నర్ మైక్ కూడా కట్ అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గత నెలలో తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ రవి ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో కొన్ని పేరాలు  చదవకుండా, సొంతంగా కొన్ని పేరాలు చదవడంతో గవర్నర్ సమక్షంలోనే తయారుచేసిన ప్రసంగంలో లేని మాటలను గవర్నర్ ప్రసంగం నుండి తొలగించమని స్పీకర్ ను కోరుతూ తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ప్రతిపాదించారు. బహుశా దేశంలో మరెక్కడా ఓ గవర్నర్ సమక్షంలో, ఆయనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఈ విధంగా తీర్మానం ప్రతిపాదించి ఉండరు.

అదే విధంగా తమిళనాడు పేరును `తమిజగం’గా పేర్కొంటూ గవర్నర్ ప్రసంగించడం కూడా వివాదంకు దారితీసింది. రాజ్ భవన్ ఆహ్వానంలో ఆ విధంగా పేరు పేర్కొనడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రవర్తనపై అధికార కూటమి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై సహితం తమిళనాడు పేరును మార్చవలసిన అవసరం లేదంటూ గవర్నర్ వాఖ్యలతో బిజెపికి సంబంధం లేదనే సంకేతం ఇచ్చారు.

ఈ పరిణామాలను ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలసి వివరించడానికి రవి ఢిల్లీ వెడితే, అక్కడ వారిద్దరూ అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఓ విధంగా గవర్నర్ ప్రవర్తన పట్ల కేంద్ర ప్రభుత్వం అసమ్మతి వ్యక్తం చేసిన్నట్లు అయింది.

అదేవిధంగా, రిపబ్లిక్ డే ప్రసంగంలో డా. తమిళసై కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడం పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఆమె `కొత్త నిర్మాణాలు (సచివాలయం) అభివృద్ధి కాదని, ఫార్మ్ హౌస్ లు కాదని ప్రజలందరికి నివాసాలు అంటేనే అభివృద్ధి’ అంటూ చేసిన ప్రసంగం విమర్శలక్లు దారి తీసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles