కృష్ణ బోర్డు విశాఖకు తరలింపుకు  జగన్‌కు`సీమ’ నేతల షాక్!

Sunday, January 19, 2025

విభజన చట్టం మేరకు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కృష్ణా జలాల నిర్వహణ పై ఏర్పాటైన కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు (కేఆర్ఎంబి)ను కృష్ణానదికి సుదూరంగా విశాఖపట్నంకు తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించడం పట్ల ఇప్పటివరకు ప్రతిపక్షాలు, తెలంగాణ ప్రభుత్వం కూడా విమర్శలు చేస్తుండగా, తాజాగా రాయలసీమకు చెందిన సొంతపార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ కడప, కర్నూలు జిల్లాలకు చెందిన 9 మంది ఎంపీ, ఎంఎల్ఏలు లేఖ రాశారు. ఆ లేఖలతో పాటు కర్నూలులో కేఆర్ఎంబి ఎందుకు ఏర్పాటు చేయాలో వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమగ్ర లేఖను పంపినట్టు రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామి రెడ్డి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ద్వారా ఏర్పాటైన కేఆర్ఎంబి ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో కాకుండా కర్నూలులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాదికి పైగా రాయలసీమ ఉద్యమ సంఘాలు పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.  ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రజాప్రతినిధుల సంతకాల సేకరణ చేపట్టగా ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మద్దతు ప్రకటించారని, వారిలో కొందరు స్వయంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ లేఖలు రాసారని దశరథరామిరెడ్డి తెళిప్పారు.

ఈ మేరకు ఆయన విడుదల చేసిన లేఖలలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల లోక్ సభ సభ్యుడు పీ.బ్రహ్మానంద రెడ్డి, శాసన సభ్యులు హఫీస్ ఖాన్ (కర్నూలు), డాక్టర్ సుధాకర్ (కోడుమూరు), శిల్పా రవిచంద్రా రెడ్డి (నంద్యాల), కే శ్రీదేవి (పత్తికొండ), కాటసాని రాంభూపాల రెడ్డి (పాణ్యం), కడప జిల్లాకు చెందిన కే.శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దటూరు), ఎస్ రఘురామిరెడ్డి (మైదుకూరు), సీమ ప్రాంతానికి చెందిన శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) తిరుపాల్ రెడ్డి, ప్రొద్దటూరు మాజీ శాసన సభ్యుడు ఎన్.వరదరాజులు రెడ్డి ఉన్నారు.

లేఖల ద్వారానే కాకుండా రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంత్రానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు తమ డిమాండ్ కు మద్దతు ప్రకటించారని కూడా దశరధ రామిరెడ్డి తెలిపారు. ఇక ప్రజా ప్రతినిధులు సంతకాలు చేసిన లేఖలతో పాటు తెలుగు రాష్ట్రాల అవసరాలకు కృష్ణా జలాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలోనే కృష్ణా జలాల నిర్వహణను పర్యవేక్షించే సాధికార బోర్డు ఉండాలని వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖను పంపినట్టు దశరధ రామిరెడ్డి తెలిపారు.

విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేస్తే సమావేశాలకు, ఇతరత్రా హాజరుకావడానికి తమ అధికారులకు సహితం దూరభావం అవుతుందని, కృష్ణా ప్రోజెక్టుల పర్యవేక్షణకు పర్యటనలు జరపడం బోర్డు అధికారులకు సహితం ఇబ్బందుకు కలుగచేస్తుందని తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కర్నూల్ లో బోర్డును ఏర్పాటుచేయాలని కోరుతుంది. కర్నూల్ అయితే కృష్ణా పరివాహక ప్రాంతాలకు దగ్గరలో ఉండటమే కాకుండా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సహితం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles