కృష్ణా నదికి సుమారు 400 కిమీ దూరంలో ఉండే విశాఖపట్నంకు కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తరలించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ఈ కార్యాలయాన్ని కర్నూల్ కు తరలింపమని దాదాపు అన్ని పక్షాలవారు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది.
జనవరి 11న జరుగనున్న బోర్డు సమావేశం ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకోనున్నది. రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉండెడివి. అయితే విభజన చట్టం ప్రకారం ఒక బోర్డును ఆంధ్ర ప్రదేశ్ కు మార్చాల్సి ఉంది.
కృష్ణ బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నానికి తరలించమని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఈ ప్రతిపాదనను భేషరతుగా తక్షణం ఉపసంహరించుకొని, కర్నూలుకు తరలించమని బోర్డు సమావేశంలో కోరాలని సామజిక ఉద్యమకారుడు, నీటిపారుదల రంగ నిపుణుడు టి. లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ప్రతిపాదించమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో 2021 జూలై 6న విజయవాడలో నిర్వహించిన చర్చా వేదిక ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ఆ చర్చా వేదికలో వివిధ రైతు సంఘాలు, రంగాలకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు. వారిలో మాజీ మంత్రివర్యులు, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర రైతాంగ సమాఖ్య, అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీనియర్ నేత యెలినేని కేశవరావు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి, అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణరావు, రాయలసీమ సాగు నీటి సాధన సమితి, అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, రైతు నాయకులు డా.కొల్లా రాజమోహన్, కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్ బహుజన అభివృద్ధి వేదిక, కన్వీనర్ పోతుల బాలకోటయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాష్ట్ర కార్యదర్శి మల్నీడు యలమందరావు, అమరావతి రాజధాని పరిరక్షణ జె.ఎ.సి. నాయకులు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పునరాలోచన చేయక పోయకపోగా బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నానికి తరలించమని మళ్ళీ కేంద్రానికి ఉత్తరం వ్రాసి తన మొండి వైఖరిని స్పష్టం చేశారు.
“నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు” అన్న చందంగా వ్యవహరిస్తూ, కృష్ణా నది పరివాహక ప్రాంతానికి ఏ మాత్రం సంబంధంలేని విశాఖపట్నానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తరలించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించడం బాధ్యతారహితం, కుటిల రాజకీయాలకు ప్రబల నిదర్శనం మాత్రమే కాగలదు.
జగన్ పాల్పడుతున్న ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలు ప్రమాదకర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.