కృష్ణా జలాల్లో సగం వాటాకై తెలంగాణ మొండి పట్టు

Sunday, December 22, 2024

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటినా కృష్ణా జలాల పంపిణీపై ఇప్పటి వరకు ఒక పరిష్కారం కుదరలేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గాఢమైన మైత్రి కొనసాగుతున్నా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాస్పద అంశాల విషయంలో ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఎవ్వరికీ వారు మొండి పట్టుదలలకు పోవడం ద్వారా తమ రాష్ట్రంలోని ప్రజల దృష్టి ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన కొత్తలోనే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడిగా కేటాయించిన జలాలను పంచుకునేందుకు రెండు రాష్ట్రాల్లో తాత్కాలికంగా ఒక ఫార్ములాను అంగీకరించాయి. అయితే ఇప్పుడు ఆ ఫార్ములాను పక్కకు నెట్టివేసి సగం జలాలు తమకు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా, కృష్ణా జలాల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాటాల లెక్కలు తేలేవరకు 50:50 నిష్పత్తిలో చెరో సగం పంచాలని తెలంగాణ ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిసిన ఆయన కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కేంద్రం జరుపుతున్న జాప్యాన్ని ఎండగట్టారు.

2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల వాటాలు తేల్చేందుకు కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే వెంటనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. 

రెండేళ్లు దాటినా సరే ఆ నిర్ణయం అమలు కాలేదని మంత్రి హరీష్ రావు చెప్పారు. వాటాలు తేల్చేలోగా కృష్ణానదీ జలాలను చెరి సగం పంచుకుని వాడుకునేలా ఆదేశాలు జారీ చేయాలని హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే, అందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించడం లేదు.

ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమోదం లేకుండా పోలవరం ప్రాజెక్టును విస్తరించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరదనీటిని ఉపయోగించుకునే పేరుతో ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ కాంపోనెంట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా విస్తరిస్తోందని విమర్శించారు. 

పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువలను కూడా విస్తరించారని, తద్వారా ప్రతిపాదిత మొత్తం కంటే రెండింతలు, మూడింతలు ఎక్కువ నీటిని కాలువల ద్వారా తరలించే వెసులుబాటు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం సుజల స్రవంతి, వెంకటనగరం ప్రాజెక్టులతో పాటు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గోదావరి-పెన్నా లింక్ వంటి ప్రాజెక్టులను చేపట్టిందని హరీష్ రావు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles