కులాలు మాత్రమే కీలకమైన కొలబద్ధ!

Monday, September 16, 2024

భారతీయ జనతా పార్టీ అయిదు రాష్ట్రాలకు సారథుల్ని మార్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కీలకంగా సారథుల ఎంపికలో కులాలనే కొలబద్ధగా భావించినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో మొన్నటిదాకా కూడా కేవలం కాపు కులాన్ని నమ్ముకునే బిజెపి రాజకీయం నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత.. ఇద్దరు సారథులను కూడా ఒకే కాపు సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసి.. తమ దృష్టి ఎలా ఉన్నదో వారు స్పష్టంగానే సంకేతాలు పంపారు. అయితే వారికి ఏమీ ప్రయోజనం దక్కలేదు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం బండి సంజయ్ చేతిలో పగ్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరి స్థానంలో ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణలో కిషన్ రెడ్డిలను నియమించారు. ఈ ఇద్దరి నియామకంలోనూ కులాల ప్రాబల్యమే ప్రధాన పాత్ర పోషించినట్లుగా కనిపిస్తోంది.

ఏపీకి పురందేశ్వరి ఎంపిక చాలా కీలకం. కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ వచ్చిన బిజెపి సోము వీర్రాజును తప్పిస్తే గనుక.. సారథ్యం సత్యకుమార్ చేతిలో పెడుతుందని అనేక ఊహగానాలు వినిపించాయి. ఢిల్లీ అధిష్ఠానం పెద్దలతో సత్యకుమార్ కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఆయననే పదవి వరిస్తుందని అంతా అనుకున్నారు. కాకపోతే  కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి పేరు ప్రకటన అయింది. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం తెలుగుదేశం పార్టీని తమ సొంత పార్టీగా భావిస్తూ ఉంది. రెడ్డి సామాజికవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ ను తమ సొంతదిగా పరిగణిస్తున్నారు. అయినా సరే.. కమ్మసామాజికవర్గం చేతిలోనే రాష్ట్ర సారథ్యం పెట్టారు. ఈ సమయంలో మరో సంగతిని కూడా గుర్తించాలి. దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తో కూడా మంచి అనుబంధమే ఉంది. ఆమె బిజెపిలో ఉన్నప్పటికీ.. గత ఎన్నికల సమయంలో ఆమె భర్త పరుచూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. నిజానికి వారి కొడుకు సీటు కోసం ప్రయత్నించి, సాంకేతికంగా వీలుపడక దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకిదిగి ఖంగుతిన్నారు. ఇప్పుడు ఆయన పార్టీకి దూరంగానే మెలగుతున్నారు. మరి పురందేశ్వరి సారథ్యంతో వారు అధికార పార్టీ మీద ఎలా పోరాడుతారో చూడాలి.

తెలంగాణలో కిషన్ రెడ్డి ఎంపిక ప్రధానంగా కులఆధారితంగానే జరిగిందని అందరూ అంటున్నారు. భారాసకు వ్యతిరేకంగా బలపడుతున్న కాంగ్రెస్ వైపు రెడ్డి వర్గం మొత్తం ఆకర్షితులవుతుండగా.. బిజెపికి కూడా రెడ్డిని సారథిగా నియమిస్తే.. తమ పార్టీలోని వారు చేజారిపోకుండా ఉంటారనేది వారి వ్యూహంగా తేలుతోంది. మొత్తానికి రెండు రాష్ట్రాలకు కులాల ఆధారంగానే సారథులను నియమించడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles