కిషన్ రెడ్డి ఎంపికతో కేసీఆర్ కు బీజేపీ సానుకూల సంకేతం

Sunday, May 12, 2024

మొన్నటి వరకు తెలంగాణాలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని రాష్త్ర అధ్యక్షునిగా నియమించడం ద్వారా కేసీఆర్ అధికారానికి శ్రీరామ రక్షగా ఉంటామనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఖమ్మంలో పేర్కొన్నట్లు బిఆర్ఎస్, బీజేపీ బంధం మరింత పటిష్టం కావడం కోసమే ఈ నియామకం జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది.

`ఢిల్లీలో దోస్త్, గాలిలో కుస్తీ’ అన్నట్లుగా రెండు పార్టీల సంబంధాలు ఉన్నాయని జనం అనుకొంటున్నారని కొందరు బీజేపీ నేతలే చెప్పిన మాటలకు మరింత బలం కలిగే విధంగా ఈ నియామకం జరిగిన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణాలో బిజెపి గ్రాప్ పడిపోవడం, కాంగ్రెస్ లో జోష్ పెరగడంతో అటు బిఆర్ఎస్ లో, ఇటు బీజేపీలో కూడా ఆందోళన ప్రారంభమైనది.

ఇప్పటివరకు నిత్యం మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శిస్తుండే ముఖ్యమంత్రి కేసీఆర్ తమ విమర్శలను కాంగ్రెస్ పై కేంద్రీకరించడం ప్రారంభించారు. మరోవంక, ఆయన కుమార్తె కవితపై ఢిల్లీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు బృందాలు చురుకుగా వ్యవహరించకుండా కేంద్రం కట్టడి చేసింది. నేడో, రేపో కవిత అరెస్ట్ కాబోతుందని అంటూ గత సంవత్సర కాలంగా రాష్ట్ర బీజేపీ నేతలు ప్రచారంచేస్తున్నా ఆ దిశలో ఎటువంటి కదలికలు కనిపించడం లేదు.

కిషన్ రెడ్డికి అన్ని పార్టీల కీలక నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై చేసే విమర్శలు మీడియాకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటాయి. తనపై బలమైన అభ్యర్థులను పోటీకి నిలబెట్టకుండా గతంలో కాంగ్రెస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తో లోపాయికారి ఏర్పాట్లు చేసుకున్నారనే ప్రచారం బిజెపి వర్గాలలోని సాగుతుంది.

కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే పలువురు బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు వారిని కేంద్రంలోని పెద్దల వద్దకు తీసుకెళ్లి పంచాయతీ నడుపుతారనే ప్రచారం కూడా సాగుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం సహితం కాంగ్రెస్ మరో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితులను ఊహింపలేక పోతుంది.

ఇప్పటికే కర్ణాటకను చేతులారా కాంగ్రెస్ చేతిలో పెట్టమని గత నెలరోజులుగా వరుసపెట్టి భేటీలు జరుపుతూ, దేశంలో మిగిలిన చోట్ల అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే తెలంగాణాలో కాంగ్రెస్ ఏదేమైనా అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ వ్యతిరేక ఓట్లలో చీలిక తేవడం కోసమే కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.

బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో కిషన్ రెడ్డి మద్దతుదారులు అందరిని పక్కన పెట్టారనే విమర్శలు చెలరేగాయి. అందుకని ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. పైగా, ఈటెల రాజేందర్ ను ఎన్నికల మేనేజింగ్ కమిటీ చైర్మన్ గా చేయడంతో వీరిద్దరూ కలిసి తెలంగాణాలో బీజేపీ వ్యవహారాలను తమదైన రీతిలో నడిపే అవకాశం ఉంది.

అయితే, కేసీఆర్ పట్ల సానుకూల ధోరణి అవలంభిస్తున్న బీజేపీ నాయకత్వం వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న బీజేపీలో చేరిన పలువురు ఇతర పార్టీల నాయకులు ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా బండి సంజయ్ కు అనుకూలంగా, ఈటెల రాజేందర్ తదితరులకు వ్యతిరేకంగా మీడియాలో ప్రకటనలు ఇస్తున్న నేతల పరిస్థితి కూడా చూడాల్సి ఉంది.

గత కొంతకాలంగా బండి సంజయ్ ను వ్యతిరేకిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న నిజామాబాద్ ఎంపీ డి అరవింద్ నూతన రాష్త్ర అధ్యక్షుని నియామకం జరగాలనే బీజేపీ కార్యాలయంపై వచ్చి మీడియా సమావేశంలో ప్రసంగించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles