కుమారస్వామి – కేసీఆర్ బంధానికి మోదీ చెక్!

Wednesday, January 22, 2025

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్ డి కుమారస్వామి కొంతకాలంగా సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. తరచుగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో మంతనాలు జరుపుతున్నారు. కేసీఆర్ ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీని ప్రకటించిన రోజుతో పాటు, ఢిల్లీలో ఆర్భాటంగా కార్యాలయం ప్రారంభించిన రోజున కూడా ఆయన ప్రత్యేకంగా వచ్చి పాల్గొన్నారు.

పైగా, కర్ణాటకలో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రకటించారు. జేడీఎస్ అండతో కర్ణాటకలో కొన్ని సీట్లలో పోటీచేసి, కొన్ని సీట్లు గెల్చుకోవడంతో పాటు 6 శాతం ఓట్లు తెచ్చుకోవడం ద్వారా జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నం చేయవచ్చని కేసీఆర్ అంచనాలు కూడా వేసుకున్నారు. అయితే ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ తొలి బహిరంగసభలో కుమారస్వామి కనిపించక పోవడం చాలామందికి విస్మయం కలిగించింది.

బిఆర్ఎస్ వర్గాల కథనం ప్రకారం ముందే నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాల కారణంగా ఖమ్మం రాలేకపోయినా, కనీసం తన పార్టీ ప్రతినిధికి అయినా పంపి ఉండేవారు. రాజకీయ వత్తిడుల కారణంగానే కుమారస్వామి ఖమ్మం రాలేదని తెలుస్తున్నది.

దక్షిణాదిన బీజేపీ ప్రభుత్వం గల ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో కేసీఆర్ ప్రవేశించి, తన వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం ద్వారా బీజేపీ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సహించే అవకాశం లేదు. బీజేపీకి మద్దతుగా ఉన్న తెలుగు ఓటర్లను కేసీఆర్ వచ్చి జేడీఎస్ కు మళ్లిస్తే, కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సులభం అయ్యే అవకాశం ఉంటుంది.

అందుకనే ఈ విషయమై ప్రధాని మోదీ నేరుగా కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడతో మాట్లాడారని తెలుస్తున్నది. కుమారస్వామి కేసీఆర్ తో బంధాన్ని పెంచుకోవాలి అనుకుంటే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు కుమారస్వామిపై గల ఆరోపణల కూపీ లాగవలసి ఉంటుందని ఓ విధమైన బెదిరింపు కూడా చేసిన్నట్లు రాజకీయ వర్గాలలో చెప్పుకొంటున్నారు.

గతంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సంస్థలు వాటిని చేపట్టినా మొత్తం మీదా ముందుకు వెళ్లకుండా చూసుకోగలుగుతున్నారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయి. అనుకొంటే ఏదో ఒక కేసులో కుమారస్వామిని న్యాయస్థానం ముందుకు తీసుకు రావడం కష్టం కాబోదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది.

పైగా, మొదటి నుండి కేసీఆర్ ధోరణి పట్ల దేవెగౌడ కూడా ఆసక్తి చూపడం లేదు. గతంలో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తానని, మోసం చేసిన వ్యక్తి విశ్వసనీయతపై ఆయన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే కేసీఆర్ తో ముందుకు వెళ్లే విషయంలో రాగాల ప్రమాదాలను పరిగణలోకి తీసుకోవాలని కుమారుడు కుమారస్వామిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తున్నది.

అందుకనే కుమారస్వామి మాత్రమే కాకుండా, మొదటి నుండి కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ సహితం ఈ మధ్య కాలంలో మౌనంగా ఉండటం గమనార్హం. బెంగుళూరు కేంద్రంగా తన రాజకీయాలు సాగిస్తున్న ఆయనకు కుమారస్వామితో అవసరం గాని కేసీఆర్ తో కాదని ఈ సందర్భంగా స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles