తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్ళిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం కుప్పం ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్ళారు. ఈ క్రమంలో టిడిపి ర్యాలీకి, సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు ఎవరి అనుమతి కావాలంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్ వద్దకు చేరుకున్న టిడిపి శ్రేణులు కుప్పం చంద్రబాబు అడ్డా అంటూ నినాదాలు చేశారు. దీంతో టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు గాయపడగా, కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు.
పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు షోలకు, సభలకు అనుమతి లేదని డిఎస్పీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. దీనితో చంద్రబాబుకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ సభకు అనుమతి లేదు వెళ్లిపోవాలని డిఎస్పీ చంద్రబాబుకు సూచించగా..ఇక్కడి నుంచి కదిలేది లేదు అనుమతివ్వాలని బాబు పట్టుబట్టారు.
డిఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకోడానికి కూడా చంద్రబాబు నిరాకరించారు. అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు తన కారులోనే కూర్చొని ఆందోళన తెలిపారు. చివరకు రోడ్డు షోకు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్దూరు నుంచి చంద్రబాబు పాదయాత్రగా బయలుదేరారు.
అనంతరం టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల ముందే డిజిపికి లేఖ రాశామన్నారు. ఎపిలో సిఎం జగన్ పని అయిపోయిందన్నారు. టిడిపి సభలకు ప్రజలు భారీగా రావడంతో భయపడిన జగన్ సర్కార్ చీకటి జీవోలను జారీ చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి టిడిపి సభలను పెట్టుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు.
తన సొంత ఇళ్ళు ఉన్న కుప్పం నియోజకవర్గంలోని ప్రజలను కలవకుండా పోలీసులు అడ్డుకోవడం కూడదని పేర్కొంటూ పోలీసులు పద్దతి ప్రకారం విధుల్లో వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని హితవు చెప్పారు.
తన రోడ్‌షోకు, సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో లిఖత పూర్వకంగా రాసివ్వాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. జగన్ బాబాయిని ఎవరు చంపారో డిజిపి కనిపెట్టాలని సవాల్ విసిరారు. జగన్ లాంటి సిఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని ఆయన ధ్వజమెత్తారు. సిఎం జగన్ సభలకు స్కూళ్ళకు, కాలేజీలకు సెలవులు ఇచ్చి, వాటి బస్సుల్లో జనాలను తీసుకొచ్చేవారని ఆయన ఎద్దేవా చేశారు. పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి మహిళలను బలవంతంగా తరలించారని చంద్రబాబు విమర్శించారు.