కీలక నేత చకిలం, వనపర్తి జెడ్పి చైర్మన్ బిఆర్ఎస్ కు రాజీనామా 

Tuesday, November 5, 2024

ఒక వంక సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఆమె అరెస్ట్ తప్పకపోవచ్చనే ఆందోళనలో పార్టీ అగ్రనాయకత్వం ఉండగా, మరోవంక వనపర్తి, నల్గొండ జిల్లాల్లో కీలక నేతలు బిఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

నల్గొండ జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుండి కీలక పాత్ర వహిస్తున్న చకిలం అనిల్‌కుమార్‌తో పాటు  వనపర్తి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గురువారం సమావేశం ఏర్పాటు చేసి పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్నందుకు కేసీఆర్ నట్టేట ముంచారని భావోద్వేగానికి గురయ్యారు అనిల్ కుమార్. అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. అవసరమైతే నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నాని అన్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన అనిల్ కుమార్ ఎమ్మెల్సీ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి జిల్లాలో, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, పార్టీ విస్తరణలో చకిలం కీలకంగా వ్యవహరించారు. గులాబీ పార్టీలో 22 ఏళ్లుగా పనిచేసిన అనిల్ కుమార్ ప్రతి ఎన్నికలలో కూడా నల్గొండ అసెంబ్లీ టికెట్‌ ఆశించడం, ఆ తర్వాత నిరాశ చెందడం ఆనవాయితీగా మారింది.

కాగా, వనపర్తి జిల్లాలో లోక్‌నాథ్ రెడ్డితో పాటూ పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి సర్పంచ్‌ వెంకటస్వామి సాగర్‌ ఇదే బాటలో నడుస్తున్నారు.  వీరి వెంట మాజీ జడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌ గౌడ్‌, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, సింగిల్‌విండో అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు పార్టీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి తీరుతో లోక్‌నాథ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరు బీఎర్‌ఎస్‌కు రాజీనామా చేస్తామని ప్రకటించినా.. తమ పదవులకు రాజీనామాపై స్పష్టత ఇవ్వలేదు.  పార్టీలో ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ బలోపేతానికి పనిచేశామని జెడ్పీ ఛైర్మన్ లోక్‌నాథ్‌ రెడ్డి చెప్పారు.

పార్టీ కోసం పనిచేసినా తమకు గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంత్రిని కలిసేందుకు, మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పంద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ జెడ్పీ ఛైర్మన్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. వీరంతా బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు.

బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు, సభలకు తాను పెద్దఎత్తున ఖర్చు చేశానని, పార్టీ బలోపేతానికి కృషి చేశానని అనిల్ కుమార్ గుర్తు చేశారు. పార్టీ టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చి 2004, 2009 సాధారణ ఎన్నికల్లో చివరి నిమిషంలో పొత్తుల పేరుతో వేరే పార్టీకి అవకాశం ఇచ్చారని తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారని, చివరకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించినట్లు అనిల్ తెలిపారు.

గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ కి పిలిపించుకొని హామీ ఇచ్చారని చాలా సార్లు చకిలం అనిల్ కుమార్ మీడియాతో చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆ ఎన్నికల్లో కంచర్ల గెలుపు కోసం పనిచేశారు. అయితే, తనకు ఇక ఎమ్మెల్సీ పదవి దక్కలేదని, సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోయారని తీవ్ర నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిల్ కుమార్ ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles