తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజక వర్గాల ఇంఛార్జిలతో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జరిపిన సమావేశం గురించి గత కొన్ని రోజులుగా పలు కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల గురించిన ప్రకటన వస్తుందని, కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇచ్చే అంశం ప్రస్తావిస్తారని, తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న సుమారు 40 మంది పార్టీ ఎమ్యెల్యేలకు వచ్చే ఎన్నికలలో సీట్ ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తారని అంటూ ఊహాగానాలు నడిచాయి.
అయితే, ఇటీవల ఎమ్యెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరగడం, నలుగురు ఎమ్యెల్యేలను సస్పెండ్ చేయగా వారు తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తూ మరనేకమంది ఎమ్యెల్యేలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, తమ దారిలోకి వస్తారని ప్రకటించడంతో జగన్ ఆత్మరక్షణలో పడినట్లు స్పష్టమైంది.
పైగా, జగన్ కు గట్టి మద్దతుదారులుగా ఉంటూ నిత్యం టిడిపి నేతలపై ఇంతెత్తున విరుచుకు పడుతుండె పలువురు కీలక ఎమ్యెల్యేలు ఈ సమావేశానికి గైరాజరు కావడం కలకలం రేపుతున్నది. ఆ విషయమై మంత్రులు ఎవ్వరు నోరు మెదపడం లేదు. మంత్రివర్గ మార్పులు గాని, ముందస్తు ఎన్నికలు గాని లేవని, అవ్వన్నీ ప్రత్యర్ధులు సృష్టిస్తున్న పుకార్లు అంటూ కొట్టిపారేసారు.
అంతేకాకుండా, అలాగే ఏ ఒక్కరినీ వదులుకోననే సంకేతాలు ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యేలు ఓడిపోకుండా చూసుకుంటాననే భరోసా కూడా ఇచ్చారు. అంటే ఎమ్యెల్యేలలో పేరుకుపోతున్న అసమ్మతిని, నాయకత్వం పట్ల వ్యతిరేకతను, అబద్రతాభావాన్ని తొలగించేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఒక విధంగా పార్టీలో తిరుగుబాటు భయం జగన్ ను వెంటాడుతున్నట్లు స్పష్టమైన సంకేతం వెలువడింది.
గతంలో వలె బాగా పనిచేయకపోతే సీట్ ఇవ్వనని బెదిరించకుండా ఎమ్యెల్యేలను నచ్చచెప్పే రీతిలో, తనకు మానవబంధాలే ముఖ్యం అంటూ వారిని మచ్చికచేసుకొనే పద్దతిలో మాట్లాడారు. జగన్ లో కొత్త మనిషిని చూస్తున్నట్లు చాలామంది పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై వింత లెక్కలు సవివరంగా చెబుతూ ప్రజావ్యతిరేకత ఎదురవుతుందనే భయం వద్దని వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. గతంలో మాదిరిగా `వై నాట్ 175… ‘ అంటూ సవాల్ చేసే రీతిలో మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (టీడీపీ రెబల్ ఎమ్మెల్యే), ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరు కాలేదు. వీరిలో బుగ్గన కరోనా కారణంగా ముఖ్యమంత్రికి విషయం చెప్పి అనుమతి తీసుకుని గైర్హాజరయినట్లు తెలిసింది.
గత ఎన్నికల ప్రచారంలో మంత్రిపదవి ఇస్తున్నట్లు ప్రకటించి ఆ తర్వాత జగన్ తనను దూరంగా నెట్టుతున్నారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల తన కొడుకు వివాహంపై సహితం సీఎంను ఆహ్వానించలేదు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక టిడిపి నుండి వచ్చిన వల్లభనేని వంశీకి గన్నవరం నియోజకవర్గంలో స్థానిక వైసిపి నాయకత్వం సహకరించడం లేదు. పైగా, వచ్చే ఎన్నికలలో ఓడిస్తామని బహిరంగంగా సవాళ్లు విసురుతున్న వారిని సీఎం జగన్ కట్టడి చేయడంలేదని ఆగ్రహం ఉన్నట్లు చెబుతున్నారు.
మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ పాషా, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా జగన్ నిర్వహించిన ఈ కీలక సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది.ఏదేమైనా ఎమ్యెల్యేలు ఇంత పెద్ద ఎత్తున సీఎం జగన్ పట్ల తమ అసమ్మతిని గతంలో ఎన్నడూ వ్యక్తం చేయలేదు.