కిషన్ రెడ్డి మంత్రివర్గ సమావేశాలకు గైరాజర్!

Monday, September 16, 2024

రెండు తెలుగు రాష్ట్రాల నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఏకైక మంత్రిగా ఉంటూ, కాబినెట్ హోదాలో మూడు కీలకమైన మంత్రిత్వ శాఖలను  నిర్వహిస్తున్న జి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా ఈ నెల 4న నియామకం జరిగిన తర్వాత వరుసగా రెండు మంత్రివర్గ సమావేశాలకు గైరాజర్ కావడం గురించి బీజేపీ వర్గాలలో చర్చ జరుగుతోంది.

మంత్రి పదవిని వాసులు కొనేందుకు సుముఖంగా లేరని, అయితే రాష్త్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేయాలనే సంకేతం ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  తెలంగాణ అధ్యక్షునిగా వెళ్లాలని చెప్పినప్పుడే మంత్రిగా కూడా కొనసాగనీయమని కోరారని చెబుతున్నారు. మంత్రిగా ఉంటె ప్రోటోకాల్ ఉంటుందని, తన పర్యటనలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు.

అంతేకాకుండా, కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం నుండి ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించే వీలు కూడా ఉంటుందని భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో బీజేపీ డీలా పడిన తర్వాత సారధ్యం అప్పచెప్పి, మరో నాలుగైదు నెలల్లో జరిగే ఎన్నికల బాధ్యత అప్పచెప్పడం పట్ల కొంచెం కునుకు వహించినట్లు కనిపిస్తుంది.

మరోకొంత మంది కేంద్ర మంత్రులను కూడా కొన్ని రాష్ట్రాలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉండడంతో, వారందరిని లోక్ సభ ఎన్నికల వరకు మంత్రులుగా కొనసాగే సౌలభ్యం ఇవ్వాలనే వాదనలు బిజెపి కేంద్ర నేతలలో వినవస్తున్నాయి. అందుకనే మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు మంత్రి పదవికి రాజీనామా చేయబోవడం లేదని కిషన్ రెడ్డి చెబుతున్నారు.

తెలంగాణ అధ్యక్షునిగా నియామకం జరిగిన మరుసటి రోజుననే గత వారం 5న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంకు ఢిల్లీలో ఉంది కూడా హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా హాజరు కావడం లేదని కబురు పంపారు. తాజాగా, 12న మంత్రివర్గ సమావేశం జరుగగా హైదరాబాద్ లోనే ఉండిపోయి, తన నియోజకవర్గంలో పర్యటించారు.

రాష్త్ర అధ్యక్షునిగా నియామకం జరిగినప్పటి నుండి తన సారధ్యంలోని మంత్రిత్వ శాఖల పట్ల కూడా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. 12వ తేదీనే మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని ముందుగా వార్తలు రావడంతో, ఆ రోజే అమెరికాకు అధికార పర్యటనకు బయలుదేరాల్సి ఉండగా, రాజీనామా విషయమై పిఎంఓ నుండి కబురు వస్తుందని మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలోనే ఎదురు చూశారు.

అయితే, ఎటువంటి కబురు రాకపోవడంతో బుధవారం మంత్రివర్గ సమావేశంకు హాజరు కాకుండా హైదరాబాద్ వచ్చేసారు. తిరిగి సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి, శుక్రవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. ఈ నెల 18న కానీ తిరిగి రారు. ప్రధాన మంత్రి కూడా విదేశీ పర్యటనకు వెడుతూ ఉండడంతో అప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదు.

ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ’హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ సదస్సుకు హాజరై దాదాపు వారం రోజుల పాటు ఆయన అమెరికాలో ఉండనున్నారు. ప్రపంచ పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రసంగించేందుకు కిషన్ రెడ్డిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆహ్వానించింది. ఇది కిషన్ రెడ్డికి దక్కిన అరుదైన అవకాశం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles