కిషన్ రెడ్డి నాయకత్వంపై పెదవి విరుస్తున్న బిజెపి నేతలు

Saturday, January 18, 2025

నిన్నా, మొన్నటి వరకు తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం తమదే అంటూ గర్జిస్తూ వస్తున్న బీజేపీ శ్రేణుల్లో ఇటీవల కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా అకస్మాత్తుగా నిస్తేజం నెలకొంది. రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా బాహాటంగా కుమ్ములాటలకు దోహదపడిన బండి సంజయ్ ను మార్చడం అనివార్యమైనప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆ స్థానంలో నియమించడంతో ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.

గతంలో సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీలో కూడా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి, ఎదుగు బొదుగూ లేకుండా పార్టీని ఒక విధంగా నిర్వీర్యం చేసిన కిషన్ రెడ్డి హయాంలో ప్రస్తుత ఎమ్యెల్యే రాజాసింగ్ నుండి పలువురు సీనియర్ నేతలను దూరంగా ఉంచుతూ వచ్చారు. ప్రజాసమస్యలపై పోరాటాల పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపేవారు కాదు.

కిషన్‌రెడ్డి వ్యవహార శైలి బిజెపికి మేలు చేయడం కంటే కూడా ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూరుస్తాయని, అందుకు కిషన్‌రెడ్డి మెతక వైఖరితో పాటు ఎక్కడిక్కడ రాజీ ధోరణులను ప్రదర్శించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కావడం కారణంగా భావిస్తున్నారు.  రానున్న ఎన్నికలలో కమలానికి ప్రయోజనం కంటే.. నష్టాన్ని కలిగిస్తాయని కొందరూ సీనియర్ నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా చేసిన మార్పులు ఎవ్వరిలో సంతోషాన్ని కలిగించడం లేదు. రాష్ట్ర అధ్యక్షునిగా ఏకపక్ష ధోరణులతో తనకు ఇక తిరుగులేదనుకొని విర్రవీగిన సంజయ్ ఇప్పుడు ఈ మార్పును తట్టుకోలేక పోతున్నారు. తీవ్ర మనస్థాపానికి లోనయ్యారని, అధిష్టానం తనను అవమానించిందని సంజయ్ పలువురు నేతలతో తన ఆవేదనను పంచుకున్నట్లు తెలుస్తున్నది.

మరోవంక, కిషన్ రెడ్డి మోహంలో కూడా నెత్తుటి చుక్క కనిపించడం లేదు. కీలకమైన కేంద్ర మంత్రి పదవి పోగొట్టుకోవలసి వస్తుందనే ఆందోళలన ఆయనలో కనిపిస్తుంద ఎన్నికల్లో ఎటూ పార్టీకి చెప్పుకోదగిన విజయాలు చేకూర్చే అవకాశం లేకపోవడంతో, ఒక విధంగా రాజకీయంగా తెరమరుగు కావలసి వస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేస్తూనే తనను మంత్రిగా కూడా కొనసాగనీయాలని అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ప్రధాని మోదీ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో మంత్రిని రాజస్థాన్ అధ్యక్షునిగా నియమించడంతో పాటు మరికొందరు మంత్రులకు కూడా పార్టీ పదవులు ఇవ్వనున్నారని కథనాలు వెలువడుతున్నాయి. దానితో అందరికి ఒకే సూత్రం వర్తించే అవకాశం ఉంది.

మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అసంతృప్తితో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలియడంతో ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించారు. సంజయ్ నాయకత్వంలో పనిచేయలేమని ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేయడంతోనే అర్ధాంతరంగా ఆయనను ఆ పదవి నుండి తొలగించారు. ఈ విధంగా బీజేపీ నాయకత్వం బెదిరింపులకు లొంగిపోవడం ఆ పార్టీ బలహీనతలనే వెల్లడి చేస్తుంది.

అయితే, ఇప్పటి వరకు బండి సంజయ్ కు బహిరంగంగా మద్దతు ఇస్తూ వస్తున్న విజయశాంతి, జితేందర్ రెడ్డి వంటి నేతల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. అధ్యక్షుడి మార్పు పట్ల విజయశాంతి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. నిప్పులు పుట్టించే నడకను పార్టీకి రాష్ట్రంలో నేర్పిన బండి సంజయ్‌ను మార్చడం బాధాకరమని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే తమ కార్యకర్తల మనోభావాలను బిజెపి అగ్రనాయకత్వం గుర్తిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఎన్నికల మేనేజింగ్ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఈటెల రాజేందర్ `గత్యంతరం’ లేక సంతోషం ప్రకటించినా ఆచరణలో అది మొక్కుబడి పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఇక జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జి వివేక్ వెంకటస్వామి వంటి వారు కూడా తమకు తగు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అసంతృప్తిలో ఉన్నారు. కిషన్ రెడ్డి రాకతో ఇటువంటి నేతలకు ఇప్పటివరకు లభిస్తున్న `నామమాత్రపు’ ప్రాధాన్యత కూడా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు కొత్త అధ్యక్షుడి నియామకం పట్ల జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల్లో, పార్టీ శ్రేణులలో జోష్ కనిపించ లేదు. రాష్ట్ర పార్టీ కార్యాలయం బుధవారం బోసిపోయింది. కటౌట్లు, ఫ్లెక్సిలు, హడావుడి, హంగామా, సందడి.. ఇలాంటివేవీ కానరాలేదు. పార్టీలో నేతల మధ్య అంతరం అదే స్థాయిలో కొనసాగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles