కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికతో కేసీఆర్ కు మరో అస్త్రం!

Sunday, December 22, 2024

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

చివరివరకు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేయించి, ఆ అంశంపైననే ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో రాజకీయ అస్త్రాన్ని బిజెపి నేతలు ఇచ్చిన్నట్లే కాగలదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సరఫరా లేక చీకటిలో మగ్గవలసి వస్తుందని, శాంతిభద్రతలు అధ్వాన్నమై తెలంగాణ అల్లకల్లోలమై పోతుందని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించిన కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణాలో ఎన్నికల ప్రచారంకు తీసుకెళ్లే సాహసం బీజేపీ చేయగలదా? తిరిగి `తెలంగాణ సెంటిమెంట్’ రగిల్చేందుకు కేసీఆర్ కు అవకాశం ఇచ్చిన్నట్లే కాగలదా? ముందు, ముందు చూడాల్సి ఉంటుంది.

 2014 ఎన్నికలలో తన స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ ఘోరంగా పరాజయం చెందటం, ఒక్క సీటు కూడా గెలుపొందలేక పోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీలో చేరేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు.

అయితే, ఆయన చేరితే తమ ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతుందో అనే భయంతో అప్పటికే బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలు దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు పడనీయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరినా వారు పట్టించుకోలేదు. దానితో ఇప్పుడు మరోదారి లేక, బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏపీ నుండి ప్రముఖ బీజేపీ నేతలు ఎవరూ లేకపోవడం గమనార్హం.

ఏపార్టీలో పట్టించుకొనేవారు లేక రాజకీయ ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న వారిని పార్టీలో చేర్చుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి ఎదుగు, బొదుగూ లేకుండా పోతున్నది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వరకు కిరణ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం దాటి రాష్ట్రంలో మరెక్కడా రాజకీయ పర్యటనలు జరిపిన దాఖలాలు లేవు.

2014 ఎన్నికల తర్వాత ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీచేసి కొద్దీ తేడాతో ఓటమి చెందారు. ఇప్పుడు కూడా టిడిపి నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు నియోజకవర్గం అంటూ లేదని చెప్పవచ్చు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు దానికి సమానమైన నామినేటెడ్ పదవిని కేంద్రంలో ఇవ్వాలని గతంలో బేరాలు చేశారు. అందుకు బిజెపి అగ్రనాయకత్వం సుముఖత చూపలేదు. అయితే ఇప్పుడు ఎటువంటి బేరసారాలు చేశారో రాబోయే రోజులలో గాని తెలియదు.

తనకు రాజకీయ శత్రువైన డా. పి రామచంద్రారెడ్డికి 2009 ఎన్నికల అనంతరం వత్తిడిచేసి తండ్రి రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిపదవి ఇప్పించాడనే మొదటి నుండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉంటున్నారు. నాడు సిబిఐ కేసులలో జగన్ అరెస్ట్ చేయడంలో సహితం ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించారు.

ఇప్పుడేమో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రంలోని  మోదీ ప్రభుత్వం `రక్షక కవచం’ మాదిరిగా వ్యవహరిస్తున్నది. సీబీఐ కేసుల నుండి, ఆర్ధిక సమస్యల నుండి సాధ్యమయినంతవరకు సహాయం చేస్తున్నది. అంటినికి మించి టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నది. అటువంటి బిజెపితో కిరణ్ కుమార్ రెడ్డి ఏమేరకు సర్ధుకు పోగలరో చూడాల్సి ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles