గతంలో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్ర విభజన సమయంలో `తప్పటడుగు’ వేసి రాజకీయంగా అజ్ఞాతంగా ఉండాల్సి వచ్చిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం ద్వారా మరోసారి రాజకీయంగా కీలకంగా మారాలనే ఆశలకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వచ్చే తెలంగాణ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ లో సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఉపయోగపడతారనే బీజేపీ ఆశలు వమ్మయే సూచనలు కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ఆ స్థాయిలో ప్రభుత్వంలోనే, పార్టీలోనే కీలక పదవి ఇస్తారని ఎదురు చూసిన ఆయనను కేవలం జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించి పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు. జాతీయ కార్యవర్గ సమావేశం ఏడాదిలో రెండుసార్లు మాత్రమే జరుగుతుంది. అందులో 200 మందికి పైగా పాల్గొంటారు. అవి బహిరంగసభ మాదిరిగా జరుగుతాయి గాని, వాటిల్లో అర్థవంతమైన చర్చలకు అవకాశం ఉండదు.
కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాన కాంపైనర్ గా ప్రచారంకు పిలుస్తారని ఎదురు చూస్తినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక ఏపీ అధ్యక్ష పదవి అంటూ మీడియాలో గుసగుసలు వినిపించినా, రాజకీయంగా తనకన్నా జూనియర్ అనుకొంటున్న డి పురందేశ్వరిని నియమించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపిని జగన్ మిత్రపక్షంగా చూస్తుండటంతో ఆ పార్టీ పట్ల ఒకరకమైన ద్వేషభావం సీమాంధ్రులు పెంచుకున్నారు. అందుకనే జగన్ కు వ్యతిరేకిగా పేరొందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టేందుకు మొదటిసారిగా తెలంగాణాలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాష్త్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేబడుతున్న సందర్భంలో ఆయనను బిజెపి వేదిక ఇచ్చారు.
అయితే, ఈ సభ నుండి మధ్యలోనే వెళ్ళిపోయిన మాజీ ఎంపీ విజయశాంతి అందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఆ వేదికపై ఉండటమే కారణం అంటూ సోషల్ మీడియా ద్వారా స్పష్టంగా తేల్చి చెప్పడంతో ఆయన ఉనికి బిజేపికి శరాఘాతంగా మారవచ్చని సంకేతం ఇచ్చిన్నట్లయింది.
నాడు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం తనకు అసౌకర్యం కలిగిస్తోందని, అలాంటి వారు ఉన్న దగ్గర తాను ఉండటం అసాధ్యమని ట్వీట్‌లో పేర్కొంటూ విజయశాంతి బీజేపీలో కలకలం సృష్టించారు.
ఆమె పేరు చెప్పకపోయినప్పటికీ ఆ వేదికపై కిరణ్ కుమార్ రెడ్డి ఉండడంతో మధ్యలోనే వచ్చేశానని తేల్చి చెప్పారు. పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డి వంటి నాయకుల ఉనికి తెలంగాణాలో బిజెపికి ప్రతికూలం కాగలదని ఆమె హెచ్చరించినట్లయింది. ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకిస్తూ వచ్చారు. రాష్త్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయించారు.
అంతేకాదు, చివరకు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం బిల్లు తీసుకు రావడంతో ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేసి, సమైక్యాంధ్ర అంటూ ఓ పార్టీ పెట్టి, ఏపీ అంతటా అభ్యర్థులను నిలబెట్టారు. అయితే వారెవ్వరూ గెలుపొందలేదు. ఆ విధంగా `తెలంగాణకు బద్ద వ్యతిరేకి’గా ముద్రపడిన నేతను తెలంగాణాలో బీజేపీ భుజాన వేసుకోగలదా? అనే ప్రశ్న నేడు తలెత్తుతుంది.