కియా ఫ్యాక్టరీ ముందు నారా లోకేష్ సెల్ఫీ

Saturday, November 16, 2024

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర పూర్తిగా జోష్ తో కొనసాగుతుది. గురువారం 55 వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతుంది. యువగళం పాదయాత్ర 700 కి.మీ.లకు చేరడంతో గుట్టూరులో శిలాఫలకం ఆవిష్కరించారు.

ఈ మైలురాయి గోరంట్ల మండలం, మడకశిర ప్రాంతాల‌ తాగు,సాగునీటి స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కారానికి పునాది కానుందని చెబుతూ టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
 ఉదయం పెనుకొండ క్రాస్ క్యాంప్ సైట్‌లో స్థానికులతో సెల్ఫీలు దిగిన లోకేష్  అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. హరిపురంలో స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం మునిమడుగు కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో మాట్లాడి అక్కడ సెల్ఫీ తీసుకున్నారు.

నారా లోకేష్ సెల్పీ ఛాలెంజ్ కొనసాగుతోంది.. కియా ఫ్యాక్టరీ దగ్గర సెల్ఫీ దిగారు. కియా పరిశ్రమ ఇది.. ఏపీలోనే అతిపెద్ద సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్.. భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన సంస్థ అని పేర్కొన్నారు. పెట్టుబడి రూ.13వేల కోట్లు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

ఏడాదికి నాలుగు లక్షల వాహనాలు తయారవుతాయని చెబుతూ ‘ఆంధ్రప్రదేశ్‌కి ఇలాంటి కంపెనీని తీసుకురావాలని మీరు కలలో కూడా ఊహించలేరు వైఎస్ జగన్’ అంటూ ట్వీట్ చేశారు లోకేష్.   నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా టీడీపీ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు, చేసిన అభివృద్ధి పనుల్ని ప్రస్తావిస్తున్నారు. ఆ పరిశ్రమలు, కంపెనీల దగ్గర సెల్ఫీలు తీసుకుని ఛాలెంజ్ విసురుతున్నారు. సీఎం జగన్ కూడా ఇలా తాము తెచ్చిన కంపెనీల దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకో గలరా? అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు.

టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందని, కియా పరిశ్రమను ఉమ్మడి అనంతపురం జిల్లాకు తీసుకొచ్చిన ఘతన చంద్రబాబుకు దక్కుతుందని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం తప్ప, అభివృద్ధి ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

కొత్తగా పరిశ్రమలు తెచ్చింది లేదని అంటూ విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు పేరుతో హడావిడి తప్ప ఒరిగిందే ఏమీ లేదని దుయ్యబట్టారు. ఎంవోయూలు తూతూ మంత్రంగా కుదర్చుకున్నారే తప్ప.. ఆ పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని టాక్ వినిపిస్తోందని విమర్శించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ యాత్రలో లోకేష్ ను కలిశారు. లోకేష్‌కు పోరాడే వారికే టికెట్లు ఇవ్వాలని చెప్తానని ఆయన వెల్లడించారు. లీడర్లు నియోజకవర్గాల్లో ముందుకొచ్చి ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరైతే లీడర్లు బయటకు రాలేదో వారికి టికెట్లు ఇవ్వొద్దని చంద్రబాబు, లోకేష్‌లకు చెబుతానని స్పష్టం చేశారు. జగన్ పని అయిపోయింది.. ఇక తాము రెడీ కావాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles