కావలి డిఎస్పీ దురహంకారంపై నిస్తేజంగా ఏపీ బిజెపి!

Wednesday, December 18, 2024

ఏపీలో బిజెపిని `సీఎం వైఎస్ జగన్ బి టీం’ అంటూ సొంతపార్టీ వారే ఎగతాళి చేస్తున్నారు. రెండు పార్టీలు ఒక్కటే అని జనం నమ్మబట్టే ఇటీవల ఎమ్యెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు ఓట్లు వేయలేదని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవంక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అక్రమార్జన కేసుల నుండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం `రక్షక కవచం’గా వ్యవహరిస్తున్నదని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  పార్టీ పరువు నట్టేట మునుగుతున్న పట్టించుకోకుండా తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అరెస్ట్ చేయకుండా ఇప్పటివరకు కాపాడుతున్నారు.

ఇంతగా సేవలు అందిస్తున్నా తమ పార్టీ బిసి నాయకుడు ఒకరి పట్ల అకారణంగా ఒక డిఎస్పీ దురహంకారంతో బహిరంగంగా కర్కశంగా వ్యవహరిస్తే ప్రభుత్వం నుండి ఎటువంటి `సానుభూతి’ వ్యక్తం కాకపోవడంతో ఏపీ బిజెపి నేతలకు దిమ్మతిరిగిన్నట్లయింది.

దానితో పార్టీ శ్రేణుల మధ్య అయినా తమ పరువు కాపాడుకొనేందుకు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఏపీ డీజీపీ, జాతీయ బీసీ కమిషన్‌, మానవ హక్కుల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ విషయమై ఎటువంటి స్పందన లేకపోవడంతో బిజెపి నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయనకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకుడు మొగిరాల సురేష్‌ను పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో కావలి డీఎస్పీ వెంకటరమణ.. సురేష్‌ను తన రెండు కాళ్లతో బంధించి నొక్కుతున్నట్లు ఉన్న ఫొటో సోషల్ మీడియాల వైరల్‌ అయింది. తమ పార్టీ కార్యకర్తపై డీఎస్పీ కర్కశంగా వ్యవహరించారంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది.

కావలి పోలీసుల తీరును గవర్నర్‌కు వివరించిన బీజేపీ నాయకులు వెంటనే డీఎస్పీని సస్పెండ్‌ చేయాలని కోరారు. ఈ మేరకు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు.

బీసీలంటే సీఎం జగన్‌కు ఎందుకంత చిన్న చూపు అని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీన్ని నిరసిస్తూ వచ్చేనెల 16, 17 తేదీల్లో కర్నూలులో బీసీ సామాజిక చైనత్య సదస్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ముందుగానే పోలీసుల అనుమతి కోరామని, అయినప్పటికీ ఇంతవరకు స్పందన లేదని విమర్శించారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు దర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles